ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో తెలంగాణ వ్యాప్తంగా 88 లక్షల ఓట్లు గల్లంతు అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పక్రియను ప్రారంభించి రెండు వారాలు గడిచినప్పటికీ ఇంకా ప్రజలలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే బీఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం వాటిని డిజిటలైజేషన్ కూడా చేస్తున్నారు. గల్లంతు అయ్యే ఓట్లలో సగం రాజధానివేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ పత్రాల పంపిణీ, సేకరణ పూర్తయ్యాక, తెలంగాణలోని దాదాపు మూడింట ఒక వంతు మంది ఓటర్ల వివరాలు ఎన్నికల నమోదు అధికారుల పరిశీలన పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన లోపాల సంఖ్య కోటిని దాటే అవకాశం ఉందని ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి భావిస్తున్నారు. బిఎల్ఓలు పరిశీలిస్తున్న ఫారంలలో దాదాపు 30 శాతం లోపలమయంగా ఉన్నటు కనుగుంటున్నారు.
బీఎల్వోలు సరిగా ఫారాలను పంపిణీ చేయకపోవటం, చేసినా ఓటర్లు నింపకపోవటం వంటి కారణాలతో ఓట్లు గల్లంతు అవుతాయని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోనే అధికంగా ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. ఒక్కో జిల్లా నుంచి 8 లక్షల నుంచి 12 లక్షల మేర ఓట్లు రద్దవుతాయని తెలుస్తోంది.
ఈ జిల్లాల్లో ఓటరు గుర్తింపు కార్డులు ఒకటికి మించి ఉన్నాయని తేలింది. ఈ సంఖ్య పెద్దయెత్తున ఉండటంతో ఓటరు జాబితాలో తేడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజధానిలోని ఈ మూడు జిల్లాల్లో ఎన్యూమరేషన్ ఫామ్లను వంద శాతం పంపిణీ చేశామని బీఎల్వోలు, ఈఆర్వోలు అంటున్నారు. దీనికి సంబంధించి నివేదికలు కూడా సమర్పించారు.
కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఫారాలు పూర్తిగా పంపిణీ కాలేదని తెలుస్తోంది. వాస్తవానికి ఇంటింటికి వెళ్లడం లేదని, తాము ఉన్న చోటకు వచ్చిన వారికి మాత్రమే ఫారాలను అందించి, పూర్తి చేయించి తీసుకుంటున్నారని పలు చోట్ల స్పష్టం అవుతుంది. దానితో పత్రాలు అందని వారి ఓటు రద్దయ్యే అవకాశం ఉంది.
సోమవారానికి అధికారులు 15 శాతం ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. అందులో సగటున 20 శాతం రద్దయ్యే ఓట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక డిజిటలైజేషన్ 100 శాతం పూర్తయితే రద్దయ్యే ఓట్లు 35 శాతానికి పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ పరిధిలో సైతం ఎన్యూమరేషన్ ఫారాలు 40 శాతం ఓటర్లకు చేరలేదు.
ప్రధానంగా సనత్నగర్, ముషీరాబాద్, అంబర్పేట నియోజకవర్గాల్లో పత్రాలు అందలేదు. దీంతో ఇవి తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ముషీరాబాద్ ఈఆర్ఓ, ఏఈఆర్ఓలపై జిల్లా ఎన్నికల అధికారి తాజాగా చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే మిగిలిన మూడు నియోజకవర్గాల అధికారులపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అది పూర్తయ్యాక జులై 31 నాటికి ముసాయిదా ఓటరు జాబితా విడుదలవుతుంది. ఒకవేళ పేరు, ఇంటి పేరు, ఇతర వివరాలు సరిపోలకపోవటం వంటివి జరిగితే సంబంధిత ఓటరుకు ఆగస్టు 1 నుంచి నోటీసులు వెళ్తాయి. ప్రతి ఓటరు దానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డును సమర్పిస్తే సరిపోతుందని జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అదనపు కమిషనర్ చంద్రకళ స్పష్టం చేశారు.

More Stories
నేపథ్య గాయని జానకి `పద్మ భూషణ్’ ఎందుకు తిరస్కరించారు?
సీఎం ఒమర్ అబ్దుల్లాకు బిజెపి రూ. 100 కోట్ల పరువునష్టం నోటీస్
ఢిల్లీ అల్లర్లలో ఐబీ అధికారి హత్య కేసులో దోషిగా ఆప్ నేత