సేవా భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా. హెడ్గేవార్ బ్లడ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం బర్కత్పుర లోని ఆర్ ఎస్ ఎస్ ప్రాంత కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలి స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి పలువురు యువకులు రక్తదానం చేశారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి, సీఈఓ ప్రొఫెసర్ ఎ. శ్రీరాములు మాట్లాడుతూ, రక్తదానం అనేది మానవత్వానికి ప్రతీక అని తెలిపారు. ప్రమాదాలు, అత్యవసర పరిస్థితులు, శస్త్రచికిత్సలు, ప్రసవాలు వంటి సందర్భాల్లో రక్తం అందక అనేక మంది ప్రాణాపాయ స్థితిలో ఉంటారని, అలాంటి సమయంలో స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణాలను కాపాడే రక్తదాతలు దేవతలతో సమానమని పేర్కొన్నారు. ప్రతి ఆరోగ్యవంతుడు క్రమం తప్పకుండా రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
సేవా భారతి ప్రాంత కార్యదర్శి వాసు మాట్లాడుతూ, సేవా భారతి దేశవ్యాప్తంగా విద్య, వైద్యం, సేవ, స్వావలంబన, గ్రామాభివృద్ధి, విపత్తు సహాయక కార్యక్రమాలు తదితర అనేక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తోందని తెలిపారు. డా. హెడ్గేవార్ బ్లడ్ సెంటర్ ద్వారా అవసరమైన ప్రతి రోగికి సకాలంలో సురక్షితమైన రక్తాన్ని అందించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. యువత పెద్ద సంఖ్యలో రక్తదాన ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.
సేవా భారతి రాష్ట్ర అధ్యక్షులు దుర్గా రెడ్డి, రిటైర్డ్ హెల్త్ డైరెక్టర్ శ్రీమతి హైమవతి, బ్లడ్ సెంటర్ కార్యదర్శి పి నవీన్, పోటు శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ లింగంపల్లి పురుషోత్తం, సేవ ప్రముఖ్ జగదీష్, నిర్వాహకులు నవీన్, తదితర ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో పలువురు స్వచ్ఛంద రక్తదాతలు పాల్గొని రక్తదానం చేసి మానవ సేవకు తమ వంతు సహకారాన్ని అందించారు. “రక్తదానం – మహాదానం, ఒక యూనిట్ రక్తం అనేక ప్రాణాలకు జీవనాధారం” అనే సందేశంతో కార్యక్రమం ముగిసింది.

More Stories
మూడు కార్పొరేషన్లపై బిజెపి జెండా ఎగరడం ఖాయం
మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్లను వేంటనే పరిష్కరించాలి
మాదిరాజు రంగారావు సాహిత్యం మానవ జీవన విలువలకు ప్రతీక