అమెరికాలోని జార్జియాలో భారత సంతతి ప్రముఖ టెకీ, గూగుల్‌లో అత్యున్నత స్థానంలో ఉన్న షీతల్(57) దారుణ హత్యకు గురయ్యారు. కాబ్ కౌంటీలోని లారెల్ గ్రీక్ ట్రెయిల్లో ఉన్న తన ఇంట్లోనే షీతల్‌ను ఆమె భర్త కిర్క్ బీ విర్జీషియెన్ గత మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో తుపాకీతో కాల్చి చంపాడు. కిర్క్ కాల్పుల్లో వారి కుమారుడు జేసన్ (23) తీవ్రంగా గాయపడ్డాడు.
తండ్రి తనపై కాల్పులు జరుపుతుండగా ఆ 23 ఏళ్ల యువకుడు ప్రాణాలు కాపాడుకోడానికి సహాయం అర్ధిస్తూ పొరుగున ఉండే ఇళ్ల వెంబడి పరుగెత్తాడు. కాబ్ కౌంటీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం 56 ఏళ్ల కిర్క్ బి వ్రెస్జియన్ తన భార్య షీతల్, 23 ఏళ్ల కుమారుడు జాసన్‌పై హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో భార్య మృతిచెందిందని, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
ఇది ముమ్మూటికీ గృహ హింస ఘటన అని, ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని దర్యాప్తు అధికారులు తెలిపారు. కిర్క్‌పై హత్య, అక్రమంగా తుపాకీని కలిగి ఉన్నందుకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అతన్ని బెయిల్ లేకుండా కాబ్ కౌంటీ అడల్ట్ డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. వీపుపై బుల్లెట్ గాయంతో యువకుడు పరుగెత్తడం తాము చూశామని ఒక పొరుగువ్యక్తి తెలిపారు.
మొదట సహాయం కోసం దగ్గరలోని ఒక ఇంటికి వెళ్లినప్పటికీ లోపలికి వెళ్లలేకపోయాడు. ఆ తర్వాత మరో ఇంటికి పరుగెత్తగా, అక్కడి యజమానులు అతడ్ని లోపలికి తీసుకెళ్లి, ఫస్ట్ రెస్పాండర్స్ వచ్చే వరకు రక్తస్రావం ఆపడానికి ప్రయత్నించారు. రాత్రి 8 గంటలకు ముందు కొడుకు ఇంటికి వచ్చేసరికి తల్లిదండ్రులు గొడవ పడుతుండటం చూశాడని ఆ పొరుగుంటి వ్యక్తి పేర్కొన్నారు.
జార్జియా టెక్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని అయిన శీతల్ వ్రెస్సియన్ గూగుల్‌లో ఇంజనీరింగ్ లీడర్‌గా పనిచేశారు. పలు సంస్థలలో వివిధ స్థాయిలో పనిచేసిన ఆమె 20 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. జార్జియా టెక్ వెబ్‌సైట్‌లోని ఆమె బయో ప్రకారం శీతల్ ఇంగ్లాండ్, భారతదేశం, ఘానాలో పెరిగారు. జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ కోసం శీతల్ వ్రెస్సియాన్ అమెరికాకు వలస వెళ్లారు.
శీతల్ రెండు సాఫ్ట్వేర్ పేటెంట్లపై గుర్తింపు పొందిన ఆవిష్కర్తగా ఉన్నారు. అంతేకాకుండా, ఆమె జార్జియా టెక్ కాలేజ్ ఆఫ్ కంప్యూటింగ్ అడ్వైజరీ బోర్డులో సేవలందించారు. జార్జియా టెక్ అలమ్నీ అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్లోనూ ఆమె సభ్యురాలిగా కూడా కొనసాగారు.

More Stories
కశ్మీర్‌ను పాక్ లో చూపిస్తారా?.. బంగ్లాపై నిప్పులు చెరిగిన భారత దౌత్యవేత్త!
300 మంది అమెరికా నేవీ క్యాడెట్స్‌కు లీడర్‌గా భారతీయ విద్యార్థిని
‘మా తండ్రి రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాం’.. మోజ్తాబా శపథం