ప్రముఖ గాయని ఎస్.జానకి కన్నుమూత!

ప్రముఖ గాయని ఎస్.జానకి కన్నుమూత!

దశాబ్దాల పాటు తన అమృత గాత్రంతో కోట్లాది మందిని అలరించిన ‘దక్షిణ భారత కోకిల’ ఎస్. జానకి (88) శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మైసూర్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్త విన్న సినీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. 

భారతీయ చిత్రసీమ, ముఖ్యంగా దక్షిణాది సినీ పరిశ్రమ ఒక కన్నతల్లిని కోల్పోయినంతగా శోకసంద్రంలో మునిగిపోయింది.  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కలిపి 50 వేలకు పైగా పాటలతో గాన కోకిలగా విరాజిల్లిన జానకి ఇక లేరనే వార్త సంగీత ప్రియులను కలచివేస్తోంది.

దక్షిణాదిలో నేపథ్య గాయనిగా ప్రఖ్యాతి వహించిన ఎస్.జానకి 1938 ఏప్రిల్ 23న జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని పల్లపట్ల ఆమె స్వస్థలం. నేపథ్య గాయనిగా తమిళంలో మొదటి పాటపాడారు. అనంతరం 1957లో విడుదలైన ఎమ్మెల్యే చిత్రంలో `నీ ఆశ ఆడియాస’ పాటతో ఆమె తెలుగు అభిమానులకు పరిచయమయ్యారు.

తొలితరం గాయకుడు ఘంటసాల నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతోనూ ఎన్నో అద్భుతమైన గీతాలు ఆలపించారు జానకి. ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ పురస్కారం అందుకున్నారామె. పది నంది అవార్డులు, కేరళ ప్రభుత్వం నుంచి 11 అవార్డులు, ఒడిశా నుంచి ఒకటి, 1986లో కలైమామణి అవార్డు స్వీకరించారు. ఇక 2013లో జానకిని భారత ప్రభుత్వం పద్మ భూషణ్‌ అవార్డుతో సత్కరించింది. 33 ఫిల్మ్ అవార్డులు కూడా లభించాయి.

దాదాపు 60 ఏళ్లకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు సుమారు 17 భాషల్లో 48వేల పైగా పాటలను ఆలపించి రికార్డు సృష్టించారు. భాష ఏదైనా, భావాన్ని పలికించడంలో ఆమె శైలి అనన్య సామాన్యం. ముఖ్యంగా తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఆమె పాడిన పాటలు శ్రోతలను ఎంతగానో ఉర్రూతలూగించాయి. 
 
చిన్న పిల్లల గొంతు దగ్గర నుంచి వృద్ధుల గొంతు వరకు ఎలాంటి శబ్దాలనైనా అలవోకగా పలికించగల అద్భుత స్వర విన్యాసం ఆమె సొంతం. భారతీయ సినీ సంగీత చరిత్రలో ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం – ఇళయరాజా – ఎస్. జానకి’ కాంబినేషన్ ఒక సంచలనం. ఈ ముగ్గురి కలయికలో వచ్చిన పాటలు దక్షిణాది ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్స్‌గా మారాయి.
 
ఎస్పీబీతో కలిసి జానకి గారు పాడిన వేలాది యుగళ గీతాలు ప్రేమికులకు అమృతకావ్యాలుగా నిలిచాయి. ఇళయరాజా స్వరకల్పనలో ఆమె పాడిన మెలోడీలు సంగీత ప్రియుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాయి. సంగీత ప్రపంచంలో ఎన్నో శిఖరాలను అధిరోహించిన జానకి వ్యక్తిగత జీవితంలో కొన్ని తీవ్ర విషాదాలు ఉన్నాయి. 
 
1997లో ఆమె భర్త వి. రామ్‌ప్రసాద్ గుండెపోటుతో కన్నుమూశారు. ఈ ఏడాది జనవరిలోనే ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ కూడా తుదిశ్వాస విడిచారు. కొడుకు మరణించిన కొద్ది నెలలకే జానకి కూడా అనంత లోకాలకు తరలిపోవడం అభిమానుల గుండెలను పిండేస్తోంది.