వియత్నాంలో మునిగిన భారత పర్యాటకుల బోటు.. 32 మంది గల్లంతు

వియత్నాంలో మునిగిన భారత పర్యాటకుల బోటు.. 32 మంది గల్లంతు

వియత్నాంలో భారీ విషాదం జరిగింది. భారత టూరిస్టులు ప్రయాణిస్తున్న బోటు ఒకటి నీట మునిగింది. ఈ ప్రమాదంలో పర్యాటకులు గల్లంతయ్యారు. వియత్నాంలోని ఫు క్యూక్‌ ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో తెలుగువారు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో 32 మంది వరకు గల్లంతు కాగా, ఇప్పటి వరకు 15 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.

వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో ఉన్న హోన్ మే రుట్ న్గోయ్ వద్ద శనివారం పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక స్పీడ్‌బోట్ బోల్తా పడటంతో, స్థానిక అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారని భారత రాయబార కార్యాలయం తెలిపింది. తాము పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని కూడా అది పేర్కొంది. 

ఇటీవల ఓ మొబైల్ కంపెనీ 250 మందితో కూడిన ఒక బృందాన్ని భారత్‌ నుంచి వియత్నాం పర్యటనకు తీసుకెళ్లింది. వీళ్లంతా మొబైల్ కంపెనీకి చెందిన డిస్ట్రిబ్యూటర్లుగా తెలుస్తుంది. అయితే ఇందులో 40 మంది తెలంగాణ, 35 మంది ఆంధ్రప్రదేశ్​కు చెందిన మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు.

“వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో భారత పర్యాటకులతో వెళ్తున్న ఒక పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదం అత్యంత విచారకరం. స్థానిక అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు, ఎంతమంది పర్యాటకులు ఉన్నారు అనే పూర్తి వివరాలను సేకరిస్తున్నాం” – వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం

ఈ ప్రమాదంపై సమాచారం, సహాయం అందించేందుకు అధికారులు కంట్రోల్ రూమ్​ల ఏర్పాటు చేశారు. హనోయిలోని భారత రాయబార కార్యాలయంతోపాటు హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్ ఆఫీస్​లోనూు కంట్రోల్ రూమ్​లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా లేదా సహాయం అవసరమైనా తమను సంప్రదించవచ్చని భారత దౌత్య కార్యాలయం హెల్ప్​లైన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

వియత్నాంలో సరిగ్గా ఏడాది క్రితం ఇలాంటి పడవ ప్రమాదమే ఒకటి జరిగింది. 2025 జులైలో వియత్నాంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన హాలాంగ్ బేలో భారీ ప్రమాదం సంభవించింది. 48 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక బోటు తుపాను వల్ల వచ్చిన బలమైన గాలులతో సముద్రంలో మునిగిపోయింది. ఆ ప్రమాదంలో 20 మంది పిల్లలతో సహా మొత్తం 35 మంది పర్యాటకులు ప్రాణాలు చనిపోయారు. ఈ ఘటన గతేడాది ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.