జాతీయ గీతం ఆలాపనలో సరైన సాహిత్యం, ఉచ్ఛారణ తప్పనిసరి

జాతీయ గీతం ఆలాపనలో సరైన సాహిత్యం, ఉచ్ఛారణ తప్పనిసరి

జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందేమాతరం ఆలపించేటప్పుడు ఎలాంటి తప్పులు దొర్లకుండా అధికారికంగా నిర్దేశించిన సాహిత్యాన్ని, స్పష్టమైన ఉచ్ఛారణను, పదాల స్పష్టతను తప్పనిసరిగా పాటించాలని  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అధికారిక లిపిని, పద వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకూడదని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వ శాఖలతో సహా అన్ని రాష్ట్రాల గవర్నర్ కార్యాలయాలకు జులై 9న హోం శాఖ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. 

ఈ ఉత్తర్వుల్లో జాతీయ గీతం, జాతీయ గేయాన్ని ఏ సందర్భాల్లో తప్పనిసరిగా ఆలపించాలి లేదా వినిపించాలి. ఏ సందర్భంలో అవసరాన్ని బట్టి వినిపించొచ్చు అనే దానికి సంబంధించి ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనల్ని హోం శాఖ పునరుద్ఘాటించింది. హోం శాఖ ఆదేశాల ప్రకారం- జాతీయ గీతం, జాతీయ గేయాలను ఆలపించే లేదా ప్లే చేసే ప్రతి సందర్భంలోనూ అధికారికంగా ఆమోదించిన సాహిత్యాన్నే ఉపయోగించాలి. 

పదాల ఉచ్ఛారణ, స్పష్టతలో (డిక్షన్) ఎలాంటి పొరపాట్లు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన అధికారిక సాహిత్యం, ఉచ్ఛారణ మార్గదర్శకాలను హోం శాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం- పౌర పురస్కారాల ప్రదానోత్సవాలు, రాష్ట్రపతి అధికారిక కార్యక్రమాల్లో ఆయన వచ్చే సమయంలో, తిరిగి వెళ్లే సమయాల్లో వందేమాతరం ఆలపించాలి. 

రాష్ట్రపతి రేడియో (ఆకాశవాణి), టీవీల ద్వారా దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించే ముందు, ప్రసంగం ముగిసిన తర్వాత కూడా దీనిని వినిపించాల్సి ఉంటుంది. రాష్ట్రాల్లో గవర్నర్, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్లు అధికారిక కార్యక్రమాలకు వచ్చినప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు, ఇంకా పరేడ్‌లో జాతీయ జెండాను తీసుకొచ్చే సందర్భాల్లో జాతీయ గేయం వందేమాతరం వినిపించాలని స్పష్టం చేసింది. 

వీటితో సహా ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశించే ఇతర సందర్భాల్లోనూ జాతీయ గేయాన్ని వాడుకోవచ్చని పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో జాతీయ గీతం లేదా జాతీయ గేయంతో పాటు రాష్ట్ర గీతాన్ని కూడా ఆలపించే ఆనవాయితీ ఉందని హోం శాఖ పేర్కొంది. అలాంటి సందర్భాల్లో ముందుగా వందేమాతరం, ఆ తర్వాత జనగణమన ఆలపించాలని స్పష్టం చేసింది. 

జాతీయ గేయం, జాతీయ గీతానికి సముచిత గౌరవం కల్పించే విధంగా ఈ క్రమాన్ని పాటించాలని సూచించింది. ఈ ఏడాది జనవరి 28న హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను కూడా తాజా ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. అధికారిక కార్యక్రమాల్లో 3 నిమిషాల 10 సెకన్ల నిడివి గల ఆరు చరణాల అధికారిక రూపంలోని వందేమాతరం ఆలపించాలని పేర్కొంది. జాతీయ గేయం ఆలపించే సమయంలో సభలో ఉన్న ప్రతి ఒక్కరూ అటెన్షన్‌ పొజిషన్‌లో కచ్చితంగా నిల్చోవాలని స్పష్టం చేసింది.

వందేమాతరం ఎప్పుడు పాడాలనే అంశంపై అన్ని సందర్భాలను ఒక జాబితా రూపంలో నిర్దేశించలేమని కేంద్రం పేర్కొంది. కానీ జాతీయ గేయానికి ఇవ్వాల్సిన సముచిత గౌరవాన్ని, క్రమశిక్షణను పాటిస్తూ- ప్రజలు ఎక్కడైనా, సామూహికంగా దీనిని ఆలపించవచ్చని, అందుకు ఎలాంటి ఆంక్షలు లేదా అభ్యంతరాలు లేవని స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఈ మార్గదర్శకాల్ని మరోసారి గుర్తు చేసింది. 1950 జనవరి 24న రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన తీర్మానం ప్రకారం రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘జనగణమన’ ను భారత జాతీయ గీతంగా గుర్తించింది. అదే తీర్మానంలో భారత స్వాతంత్రోద్యమంలో చారిత్రక పాత్ర పోషించిన బంకిం చంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరానికి కూడా జనగణమనతో సమాన గౌరవ హోదా కల్పించాలని నిర్ణయించింది.