బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, తాను, ఆవామీ లీగ్‌కు చెందిన ఇతర ప్రవాస నాయకులు, తమ రాకపై అరెస్టు లేదా మరణం అనే తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నప్పటికీ, డిసెంబర్ నెలలో స్వచ్ఛందంగా బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలని భావిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు.
ఆగస్టు 2024లో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు ఆమె ప్రభుత్వాన్ని కూలదోయడంతో భారతదేశానికి వలస వెళ్లిన 78 ఏళ్ల ఈ నాయకురాలు, తిరిగి వచ్చిన తర్వాత న్యాయస్థానాల ముందు లొంగిపోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు. తన స్వదేశానికి తిరిగి రావడం గురించి ఢాకాలోని ప్రస్తుత అధికారులతో ఎలాంటి సంప్రదింపులు జరగలేదని ఆమె స్పష్టం చేశారు.
“నేను తిరిగి వచ్చినప్పుడు వారు నన్ను అరెస్టు చేయవచ్చు, వారు నన్ను చంపవచ్చు కూడా,” అని షేక్ హసీనా పెక్రోన్నారు. “అయినా, నేను వెళ్లాల్సిందే” అని స్పష్టం చేశారు. స్వదేశంలో తన రాజకీయ మద్దతుదారుల ప్రస్తుత పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, తన సొంత గడ్డపై పరిణామాలను ఎదుర్కొనే తన సంకల్పాన్ని మాజీ ప్రధాని నొక్కి చెప్పారు.
“నా పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. మరణం సంభవిస్తే, అది నా సొంత గడ్డపైనే, నా తల్లిదండ్రులను ఖననం చేసిన చోట, వారి రక్తం చిందిన చోట సంభవించాలని నేను కోరుకుంటున్నాను,” అని ఆమె తెలిపారు. ప్రదర్శనకారులపై జరిగిన ఘోరమైన అణచివేతకు ఆదేశించినందుకు బంగ్లాదేశ్ యుద్ధ నేరాల ట్రిబ్యునల్ ఆమెను దోషిగా నిర్ధారించింది.
ఈ అణచివేతలో సుమారు 1400 మంది మరణించినట్లు నివేదికలు వచ్చాయి. ఆమె ఈ ఆరోపణలను నిరంతరం ఖండిస్తూ వస్తున్నారు. 2024లో విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలపై ప్రభుత్వం జరిపిన అణచివేతకు ఈ ఆరోపణలు సంబంధించినవి. ఈ ప్రదర్శనలు చివరికి అవామీ లీగ్ ప్రభుత్వం పతనానికి దారితీశాయి.
ఆ రాజకీయ అశాంతి సమయంలో ప్రదర్శనకారుల మరణాలను ఆపమని ఆదేశించినందుకు లేదా ఆపడంలో విఫలమైనందుకు ట్రిబ్యునల్ ఆమెను బాధ్యురాలిగా పేర్కొంది. అదే తీర్పులో, ట్రిబ్యునల్ మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌కు మరణశిక్ష, మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా అల్-మామున్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
షేక్ హసీనా, కమల్ ఇద్దరి ఆస్తులను జప్తు చేయాలని న్యాయ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధికారం నుంచి తొలగించబడిన తర్వాత అవామీ లీగ్ ఒత్తిడిలో ఉన్న బంగ్లాదేశ్‌లో, ఆమె ప్రతిపాదిత పునరాగమనం రాజకీయ ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉంది. హసీనా తాజా ప్రకటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం గానీ, భారత ప్రభుత్వం గానీ వెంటనే స్పందించలేదని రాయిటర్స్ నివేదించింది.

More Stories
పాక్ ప్రభుత్వంకు పీఓకె జేఏఏసీ 48 గంటల అల్టిమేటం
“మానస్, మహాభారతం” అంతర్జాతీయ నాగరికతా అధ్యయన కేంద్రం
భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన చబహార్ పోర్టుపై అమెరికా దాడి