పాక్ ఆక్రమిత కశ్మీర్ (పిఓకె)లో ఉద్రిక్తతలు మరిత తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అక్కడ ప్రజా ఉద్యమానికి నేతృత్వం వహిస్తోన్న జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ లీగ్ (జేఏఏసీ) పాకిస్థాన్ ప్రభుత్వానికి 48 గంటల డెడ్‌లైన్ విధించింది. ఆలోగా తమ 38 డిమాండ్లను అంగీకరించకుంటే భారీ ఎత్తున నిరసనకు దిగి, తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించింది.
జులై 27 జరగనున్న స్థానిక శాసనసభ ఎన్నికల్లో 12 సీట్లను శరణార్థులకు కేటాయించడం ఈ ఉద్రిక్తతలకు కారణం. జూన్ 9న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ముజఫరాబాద్‌కు భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్టు జేఏఏసీ ప్రకటించింది. ఇది ఇటీవలి కాలంలో ఈ ప్రాంతం చూసిన అతిపెద్ద రాజకీయ ఘర్షణలలో ఒకటిగా మారుతుందనే సంకేతాలు ఇచ్చింది.
శరణార్థులకు సీట్లు కేటాయింపు పీఓకే రాజకీయాలపై ఇస్లామాబాద్ అసమానమైన ప్రభావాన్ని కొనసాగించడానికి వీలు కల్పిస్తాయని జాక్ వాదిస్తోంది. జర్నలిస్ట్ లవ్ పూరి ప్రకారం 12 శరణార్థుల సీట్లు పాకిస్థాన్‌లోని సుమారు 4.36 లక్షల నమోదిత ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, మిగిలిన 33 ప్రత్యక్షంగా ఎన్నికయ్యే సీట్లు పీఓకేలో నివసిస్తున్న దాదాపు 33 లక్షల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
ఈ ప్రాంత నివాసితులకు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల కంటే శరణార్థుల నియోజకవర్గాలకు ఇది ఎన్నికల్లో ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుందని వాదిస్తున్నారు. దీనికి తోడు 12 రిజర్వ్ సీట్లను రద్దుచేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని పీఓకే సుప్రీం కోర్టు జూన్ 7న తీర్పు ఇచ్చింది. పాకిస్థాన్ సైన్యం, పీఓకే ఉద్యమకారులకు జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.
శరణార్థుల సీట్ల అంశం తక్షణ సమస్యగా మారినప్పటికీ, జేఏఏసీ చార్టర్ అంతకంటే లోతైన ఆర్థిక అసంతృప్తిని ప్రతిబింబిస్తుంది. రిజర్వ్ సీట్లను రద్దు చేయాలని కోరడంతో పాటు, జలవిద్యుత్ ప్రాజెక్టులపై పూర్తి పునఃసమీక్ష, విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి నిత్యావసర వస్తువులపై అధిక సబ్సిడీలు, విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేసింది.
తమ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు స్థానికులు అధిక ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని కూడా వాదిస్తోంది. రాజకీయ వివక్ష, ఆర్థిక నిర్లక్ష్యం వంటి వాటిపై స్థానికులలో పెరుగుతున్న అసంతృప్తిని ఈ డిమాండ్లు ప్రతిబింబిస్తున్నాయి. 2023లో ఏర్పడిన జాక్ పీఓకేలో అత్యంత ప్రభావవంతమైన పౌర హక్కుల వేదికగా ఆవిర్భవించింది.
2024 మే నెలలో జరిగిన విస్తృత నిరసనల సమయంలో దీని పేరు వెలుగులోకి వచ్చింది. ధర్నాలు, సమ్మెలు, వీల్-జామ్ నిరసనలతో ఆ ప్రాంతాన్ని స్తంభింపజేసింది. విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, గిల్గిట్-బాల్టిస్థాన్ వంటి ఇతర పాక్ పాలనలోని ప్రాంతాలలో లభించే రాయితీలతో సమానమైన రాయితీల కోసం చేసిన డిమాండ్లు ఈ ఆందోళనకు కారణమయ్యాయి. అప్పటి నుంచి ఈ సంస్థ పదేపదే పెద్ద ఎత్తున నిరసనలను చేపట్టింది.
ఈ ప్రాంతాన్ని ‘ఆజాద్’ (స్వేచ్ఛా) కశ్మీర్‌గా పాకిస్థాన్ వర్ణిస్తుంది.. కానీ దాని రాజ్యాంగ, పరిపాలనా నిర్మాణం మరింత సంక్లిష్టమైన చిత్రాన్ని అందిస్తుంది. సాంకేతికంగా దేశంలోని ప్రావిన్సులను జాబితా చేసే పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం పీఓకే పాకిస్థాన్‌లో భాగంగా లేదు. దీంతో పాకిస్తాన్ పార్లమెంటులో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం లేదు. పీఓకేకు స్వంత అధ్యక్షుడు, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు, ఎన్నికైన అసెంబ్లీ ఇవన్నీ కాగితాలకే పరిమితం.
పెత్తనమంతా ఇస్లామాబాద్ నియంత్రణలో ఉన్న సంస్థల వద్ద ముఖ్యంగా పాకిస్థాన్ ప్రధానమంత్రి నేతృత్వంలోని కశ్మీర్ కౌన్సిల్‌దే. పీఓకే రాజ్యాంగం ప్రకారం.. ఈ ప్రాంతం పాకిస్థాన్‌లో విలీనం కావడాన్ని ఏ వ్యక్తి గానీ, రాజకీయ పార్టీ గానీ వ్యతిరేకించకూడదు. ఎన్నికలలో పోటీ చేయడానికి ముందు, అభ్యర్థులు విలీనానికి మద్దతు ఇస్తున్నట్లు ఒక ప్రకటనపై సంతకం చేయాల్సి ఉంటుంది.

More Stories
బీజేపీలో చేరిన ముగ్గురు టిఎంసి మాజీ రాజ్యసభ సభ్యులు
హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలతో గ్యాస్ సరఫరాపై ప్రభావం
“మానస్, మహాభారతం” అంతర్జాతీయ నాగరికతా అధ్యయన కేంద్రం