హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలతో గ్యాస్ సరఫరాపై ప్రభావం 

హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలతో గ్యాస్ సరఫరాపై ప్రభావం 
పశ్చిమాసియాలోని హర్ముజ్ జలసంధి వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లను ఆందోళన కారణంగా భారత్‌కు ముడి చమురు సరఫరాపై తక్షణ ప్రభావం ఉండే అవకాశం తక్కువగా ఉందని అంతర్జాతీయ ఇంధన మార్కెట్ విశ్లేషణ సంస్థ కెప్లర్ వెల్లడించింది. అయితే ఈ పరిస్థితులు ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం ఎల్‌పీజీ, ఎల్ఎన్‌జీ సరఫరాలు, రవాణా వ్యయాలు, బీమా ఖర్చులపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణపై తాజాగా చేసిన వ్యాఖ్యల అనంతరం పశ్చిమాసియాలో ఘర్షణలు చెలరేగాయి. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఇంధన రవాణా మార్గమైన హర్ముజ్ జలసంధి భద్రతపై ఆందోళనలు పెరిగాయి. అయినప్పటికీ భారత్ గత కొన్నేళ్లుగా ముడి చమురు కొనుగోలు వనరుల్ని విస్తరించుకున్న క్రమంలో ప్రస్తుతం సరఫరాపై పెద్దగా ప్రభావం లేదని కెప్లర్ విశ్లేషకుడు సుమిత్ రిటోలియా తెలిపారు. 

భారత క్రూడాయిల్ దిగుమతులకు ఎలాంటి ఆటంకం లేదని, దేశీయ రిఫైనరీలకు చమురు సరఫరా యథాతథంగానే కొనసాగుతోందని  తెలిపారు. సుమిత్ రిటోలియా వివరాల ప్రకారం- రష్యా ఇప్పటికీ భారత్‌కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా ఉంది. ఇదే సమయంలో సౌదీ అరేబియా, యూఏఈ నుంచి ప్రత్యామ్నాయ మౌలిక వసతుల ద్వారా చమురు సరఫరా కొనసాగుతోంది. 

ఇంకా పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి కూడా దిగుమతులు పెరగడంతో భారత్ గతంలో మాదిరిగా ఒకే ప్రాంతంపై ఆధారపడే పరిస్థితి తగ్గింది. దీంతో సరఫరా వ్యవస్థ మరింత బలపడిందని ఆయన చెప్పారు. ఈ వ్యూహం ఫలితంగానే 2026 జూన్ నెలలో భారత్ రికార్డు స్థాయిలో రోజుకు సగటున 4.93 మిలియన్ బ్యారెళ్ల చొప్పున క్రూడాయిల్ దిగుమతి చేసుకుంది. 

దీంట్లో సుమారు 2.7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రష్యా నుంచే వచ్చింది. అంటే మొత్తం క్రూడ్ దిగుమతుల్లో దాదాపు సగానికిపైగా రష్యా వాటానే ఉండటం వల్ల, రష్యా భారత్‌కు ప్రధాన ఆయిల్ సరఫరాదారుగా తన స్థానాన్ని మరింత బలపర్చుకుంది. హర్ముజ్ జలసంధి మీదుగా చమురు నౌకల రాకపోకలు ప్రస్తుతం కొనసాగుతున్నప్పటికీ, ఉద్రిక్తతలు కొనసాగితే మాత్రం భారత్‌పై ప్రభావం పడుతుందని కెప్లర్ అంచనా వేస్తోంది. 

ఇదే పరిస్థితి కొనసాగితే షిప్పింగ్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ ప్రీమియాలు పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా ఆంక్షలు, వాణిజ్యపరమైన అనిశ్చితి కారణంగా సమీప భవిష్యత్తులో ఇరాన్ చమురు- భారత దిగుమతుల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపించడం లేదని పేర్కొంది. కెప్లర్ విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం అసలు ఆందోళన ముడి చమురుపై కాకుండా ఎల్‌ఎన్‌జీ, ఎల్‌పీజీ    పైనే ఉంది. ఈ ఇంధనాలకు తక్షణ ప్రత్యామ్నాయాలు తక్కువగా ఉండటంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగితే సరఫరా తగ్గడం, రవాణా వ్యయాలు పెరగడం తద్వారా ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని హెచ్చరిక చేసింది.