షుగర్‌ బాధితులకు వారానికి ఒక్క ఇంజెక్షన్‌ చాలు!

షుగర్‌ బాధితులకు వారానికి ఒక్క ఇంజెక్షన్‌ చాలు!
మధుమేహం చికిత్సలో కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే వారానికి ఒక్కసారి తీసుకునే బేసల్‌ ఇన్సులిన్‌ను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. డెన్మార్క్‌కు చెందిన ఔషధ సంస్థ నోవో నార్డిస్క్‌ ‘అవిక్లీ ‘ పేరుతో ఈ ఇన్సులిన్‌ను విడుదల చేసింది.  ప్రపంచంలో ఈ ఔషధాన్ని ప్రవేశపెట్టిన ఆరో దేశంగా భారత్ నిలిచింది. కంపెనీ తెలిపిన ప్రకారం, ఇది ప్రపంచంలోనే తొలి వారానికి ఒక్కసారి తీసుకునే బేసల్ ఇన్సులిన్ ఇంజెక్ష‌న్ కావ‌డం విశేషం.
 
టైప్‌-1, టైప్‌-2 మధుమేహంతో బాధపడే వారికి ఇది ఉపయోగపడనుంది.  కానీ తాను దీన్ని టైప్-2 మధుమేహ రోగులకు ఒక పరిష్కారంగా చూస్తున్నాన‌ని  నోవో నోర్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా తెలిపారు. సాధారణంగా ఇన్సులిన్‌ తీసుకునే రోగులు రోజూ ఒకసారి లేదా అంతకంటే ఎక్కువసార్లు ఇంజెక్షన్‌ తీసుకోవాల్సి వస్తుంది. కొత్తగా వచ్చిన ‘అవిక్లీ తో వారానికి ఒక్కసారి ఇంజెక్షన్‌ తీసుకుంటే సరిపోతుంది. 
 
దీంతో ఏడాదికి 365 ఇంజెక్షన్ల స్థానంలో కేవలం 52 వేసుకుంటే చాలు. రోజూ సూది తీసుకోవాలనే భయంతో చాలామంది ఇన్సులిన్‌ను ఆలస్యంగా ప్రారంభిస్తుంటారని, ఈ సమస్యకు కొత్త చికిత్స ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. భారత్‌లో ప్రస్తుతం దాదాపు 10.1 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. మరో 13.6 కోట్ల మందిలో ప్రీ డయాబెటిస్‌ లక్షణాలు ఉన్నాయి. 
 
అలాగే తొమ్మిది లక్షల మందికిపైగా టైప్‌-1 మధుమేహ రోగులు ఉన్నారు. టైప్‌-2 మధుమేహంతో బాధపడేవారిలో కూడా కొంతమందికి ఇన్సులిన్‌ తప్పనిసరిగా అవసరం అవుతోంది. ఈ ఇన్సులిన్‌ను ఫ్లెక్స్‌టచ్‌ పెన్‌ ద్వారా వారానికి ఒక్కసారి తీసుకోవాలి.  ప్రస్తుతం కేవలం 60 నుంచి 70 లక్షల మంది మాత్రమే ఇన్సులిన్ ఉపయోగిస్తున్నారని, అయితే మొత్తం రోగుల్లో సుమారు 25 నుంచి 30 శాతం మందికి ఇన్సులిన్ ప్రారంభించాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు.

ఇలా తక్కువసార్లు ఇంజెక్షన్‌ తీసుకోవాల్సి రావడంతో చికిత్సను క్రమం తప్పకుండా కొనసాగించే అవకాశం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే సామర్థ్యంలో ఇది రోజూ తీసుకునే ఇన్సులిన్‌తో పోలిస్తే మెరుగైన ఫలితాలు ఇచ్చినట్లు క్లినికల్‌ పరీక్షల్లో తేలిందని కంపెనీ వెల్లడించింది. భద్రత విషయంలో కూడా ఇదే స్థాయి ఫలితాలు నమోదయ్యాయని తెలిపింది.

రోజూ ఇంజెక్షన్ల భయం, చికిత్స క్లిష్టంగా ఉండటం వల్ల చాలామంది ఇన్సులిన్‌ను ఆలస్యంగా ప్రారంభిస్తారని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారికి వారానికి ఒక్కసారి తీసుకునే ఈ కొత్త ఇన్సులిన్‌ మంచి ప్రత్యామ్నాయంగా మారొచ్చని అభిప్రాయపడుతున్నారు. దీంతో మధుమేహ నియంత్రణ మరింత సులభం అయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.