ఎల్‌నినోపై కేంద్రం అప్రమత్తత … పిఎంఒ అత్యున్నత స్థాయి సమీక్ష

ఎల్‌నినోపై కేంద్రం అప్రమత్తత … పిఎంఒ అత్యున్నత స్థాయి సమీక్ష
దేశ ఆర్థిక వ్యవస్థపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్న వేళ కేంద్రం అప్రమత్తమైంది. దేశంలో నైరుతి రుతు పవనాల పురోగతి, ఖరీఫ్ సీజన్‌పై ఎల్‌నినో ప్రభావం, వివిధ శాఖల సన్నద్ధతపై ప్రధాన మంత్రి కార్యాలయం అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ప్రధాన మంత్రి ముఖ్యకార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన జరిగిన సమావేశంలో భారత వాతావరణశాఖ(ఐఎండీ), వ్యవసాయ, జలవనరులు, పశుసంవర్ధక , ఆరోగ్యం తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. 
 
ఈ సమావేశంలో దేశ వ్యాప్తంగా వర్షపాతం లోటు 12 శాతానికి తగ్గిందని అధికారులు తెలిపారు. జూన్ నుంచి జులై 7 వరకు నమోదైన వర్షపాతం వివరాలను ఐఎండీ అధికారులు సమావేశంలో వెల్లడించారు. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో రుతుపవనాలు సుమారు పదిరోజులు ఆలస్యంగా ప్రవేశించాయని, అయినప్పటికీ జులై 7 నాటికి దేశ వ్యాప్తంగా వర్షపాతం లోటు 12 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. 
 
జులై తొలివారంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని, జులై, ఆగస్టు నెలల్లో తక్కువ లేదా మోస్తరు స్థాయిలో ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని వివరించారు. జులై నెలలోనే మొత్తం రుతుపవనాల వర్షపాతంలో 30 శాతానికి పైగా వర్షం కురుస్తుండటంతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది

ఎల్‌నినో ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న 262 జిల్లాలకు వ్యవసాయ అత్యవసర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసినట్టు వెల్లడించింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఎఆర్) వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలకు ప్రత్యేక మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఆహార భద్రతపై దృష్టి వర్షాభావ పరిస్థితులు ఎదురైనా వాతావరణ అనుకూల విత్తనాలు , ఆధునిక సాంకేతికతల కారణంగా గత కొన్నేళ్లుగా ఆహార ధాన్యాల ఉత్పత్తి నిలకడగా కొనసాగుతోందని సమావేశంలో అధికారులు తెలిపారు. 
 
పశుసంవర్ధక శాఖకు పొడిమేత, పచ్చిమేత, పశువుల దాణా లభ్యతపై సమగ్ర అంచనా చేయాలని సూచించారు. తాగు నీటిశాఖకు సమస్యాత్మక జిల్లాల్లో సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించి, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అధిక తేమ, వేడిగాలులు, డెంగ్యూ వ్యాప్తిపై ఆరోగ్యశాఖ చేసిన హెచ్చరికలు గ్రామీణ స్థాయివరకు సమర్ధంగా చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 
 
బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాల బఫర్ నిల్వలు, ఎరువుల లభ్యతపై వినియోగదారుల వ్యవహారాల శాఖ, ఎరువుల శాఖ నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసం వీబీజీ రామ్‌జీ ద్వారా ఇప్పటికే కోటి పనిదినాలు కల్పించినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. రుతుపవనాల పరిస్థితి, ఆలస్యంగా కురిసే వర్షాల ప్రభావాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు అంచనా వేయాలని ప్రధాన మంత్రి ముఖ్యకార్యదర్శి పీకే మిశ్రా సూచించారు.