గగన్‌యాన్ మిషన్‌లో ప్రధాన పారాచూట్ పరీక్ష విజయవంతం

గగన్‌యాన్ మిషన్‌లో ప్రధాన పారాచూట్ పరీక్ష విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగన్‌యాన్ మిషన్‌లో వినియోగించే క్రూ మాడ్యూల్ ప్రధాన పారాచూట్‌కు సంబంధించిన అత్యంత కీలక పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షను మంగళవారం మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో ఉన్న ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏడీఆర్‌డీఈ) డ్రాప్ జోన్‌లో చేపట్టినట్లు ఇస్రో బుధవారం వెల్లడించింది. 
 
మొదటి మానవరహిత గగన్‌యాన్ ‘జీ-1’ మిషన్‌లో ఎదురయ్యే గరిష్ఠ లోడ్ పరిస్థితుల్లో ప్రధాన పారాచూట్ నిర్మాణ బలం, పనితీరును నిర్ధారించడమే ఈ పరీక్ష ఉద్దేశమని ఇస్రో తెలిపింది. పరీక్షలో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్-76 విమానం ద్వారా 2.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి ప్రధాన పారాచూట్ నమూనాతో పాటు డమ్మీ బరువును కిందికి వదిలారు.
 
మొదట డ్రోగ్ పారాచూట్ తెరుచుకుని క్రూ మాడ్యూల్‌ను స్థిరపరచడంతో పాటు దాని వేగాన్ని గణనీయంగా తగ్గించింది. అనంతరం ప్రధాన పారాచూట్ పనిచేసి పేలోడ్ సురక్షితంగా నేలపై దిగేలా వేగాన్ని మరింత తగ్గించింది. గగన్‌యాన్ మిషన్ కోసం నిర్వహిస్తున్న సమగ్ర ప్రధాన పారాచూట్ ఎయిర్‌డ్రాప్ పరీక్షల (ఐమ్యాట్) శ్రేణిలో ఇది ఐదో పరీక్ష అని ఇస్రో పేర్కొంది. 
 
ఈ పరీక్ష విజయవంతం కావడంతో తొలి మానవరహిత గగన్‌యాన్ ‘జీ-1’ మిషన్‌లో ప్రధాన పారాచూట్ వ్యవస్థ పనితీరు, విశ్వసనీయతపై మరింత నమ్మకం ఏర్పడిందని తెలిపింది. గగన్‌యాన్ క్రూ మాడ్యూల్‌లో మొత్తం నాలుగు రకాల 10 పారాచూట్లు ఉంటాయి. వీటిలో రెండు అపెక్స్ కవర్ సెపరేషన్ పారాచూట్లు వాహనంపై ఉన్న రక్షణ కవచాన్ని తొలగిస్తాయి. 
 
ఈ కవచం భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో పారాచూట్ విభాగాన్ని తీవ్రమైన వేడి నుంచి రక్షిస్తుంది. అనంతరం రెండు డ్రోగ్ పారాచూట్లు, మూడు పైలట్ పారాచూట్ల సహాయంతో మూడు ప్రధాన పారాచూట్లు తెరుచుకుని క్రూ మాడ్యూల్‌ను సురక్షితంగా భూమిపై దించేలా వ్యవస్థ రూపొందించారు.