2008 నాటి అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు 38 మంది దోషులకు గతంలో ప్రత్యేక న్యాయస్థానం విధించిన మరణశిక్షను, మరో 11 మందికి విధించిన జీవిత ఖైదును సమర్థించింది. జస్టిస్ ఎ.వై. కొగ్జే, జస్టిస్ సమీర్ దవేలతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్, దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అన్ని అప్పీళ్లను తోసిపుచ్చింది.
నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘ఇండియన్ ముజాహిదీన్’ సభ్యులకు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షలను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. అలాగే, నిందితుల అప్పీళ్లన్నింటినీ హైకోర్టు తిరస్కరించింది. దీనితో పాటు, మృతుల బంధువులకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష పరిహారం ఇవ్వాలని పేర్కొంది.
2008 జులై 26వ తేదీ సాయంత్రం, సుమారు 45 నిమిషాల వ్యవధిలో అహ్మదాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఒకదాని తర్వాత ఒకటిగా 21 బాంబులు పేలాయి. మణి నగర్, ఇసాన్‌పుర్, నరోడా, బాపునగర్, సర్ఖేజ్, హత్కేశ్వర్ వంటి రద్దీ ప్రాంతాలను దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. నగరంలోని బస్సులు, బహిరంగ ప్రదేశాలు, మార్కెట్లలో బాంబులు అమర్చారు. అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్, ఎల్.జీ. హాస్పిటల్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు.
మొదటి పేలుడులో గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా, అక్కడ మరో పేలుడు సంభవించింది. ఈ దాడిలో మొత్తం 56 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఉగ్రవాద దాడిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు 2022లో భారత న్యాయ చరిత్రలోనే అత్యధికంగా ఒకే కేసులో 38 మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
మిగిలిన 11 మందికి జీవితకాలం జైలు శిక్ష విధించింది. చట్టప్రకారం దిగువ కోర్టు విధించిన మరణశిక్ష అమలు కావాలంటే హైకోర్టు ధ్రువీకరణ తప్పనిసరి అవుతుంది. ఈ నేపథ్యంలో దాదాపు రెండేళ్లకు పైగా విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు, తాజాగా ఆ శిక్షలను ఖరారు చేస్తూ తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్, గుజరాత్ ఏటీఎస్, ఇతర దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా దర్యాప్తు నిర్వహించాయి.
గుజరాత్‌తో సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనుమానితులను అరెస్టు చేశారు. సాక్షుల ఆధారంగా మొత్తం కుట్రను ఛేదించినట్లు దర్యాప్తు సంస్థలు తెలిపాయి. ఈ కేసులో మొత్తం 77 మంది నిందితులపై అభియోగాలు మోపారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి స్పందిస్తూ హైకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించిందని, ఈ కేసులో దాదాపు నిందితులందరికి శిక్ష ఖరారైందని చెప్పారు

More Stories
సిరియా రాజధానిలో భారీ పేలుళ్లలో తప్పించుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు
బ్యారెల్ ముడి చమురు 70 డాలర్ల దిగువకు
అమరావతిలో రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్