సౌదీ అరేబియా నుండి తిరిగి వస్తుండగా అరెస్టయిన కేరళకు చెందిన ఒక వ్యక్తిపై పోలీసులు కఠినమైన యుఎపిఎ చట్టాన్ని ప్రయోగించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వ్యక్తి కుమార్తెకు సంబంధించిన వీడియో కింద అభ్యంతరకర వ్యాఖ్య చేశారన్న ఆరోపణపై ఇతనిని అదుపులోకి తీసుకున్నారు. మలప్పురం జిల్లా ఐక్కరప్పడికి చెందిన మహమ్మద్ సనూఫ్ (26)పై ఈ చట్టాన్ని నమోదు చేశారు.
ఇతను జూలై 4న కరిపూర్ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అదుపులోకి తీసుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన కొచ్చికి చెందిన ఎన్. రామచంద్రన్ కుమార్తెకు సంబంధించిన వీడియో కింద అభ్యంతరకర వ్యాఖ్య చేశారన్న ఆరోపణపై గత ఏడాది ఇడుక్కి జిల్లాలోని ముట్టం పోలీసులు సనూఫ్‌పై కేసు నమోదు చేశారు.
భారతీయ జనతా యువ మోర్చా నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
సనూఫ్‌పై పోలీసులు ‘లుకౌట్ నోటీసు’ జారీ చేయగా, దాని ఆధారంగానే విమానాశ్రయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారించి, అతని మొబైల్ ఫోన్ పరిశీలన తర్వాత యూపిఏ నమోదు చేసినట్లు ముట్టం పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ప్రాథమిక విచారణలో కీలక ఆధారాలు లభించాయని, వాటి ఆధారంగానే యుపిఎ నమోదు చేయాలని నిర్ణయించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సనూఫ్‌ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
సమగ్ర విచారణ కోసం అతనిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్ లేదా యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు అప్పగించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఈ అరెస్టుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, “పహల్గామ్ ఉగ్రదాడిలో తోటి కేరళీయుడి దారుణ హత్యను సంబరంగా భావించేలా ఒక యువ మలయాళీకి ఎలా బ్రెయిన్ వాష్ జరుగుతుంది?” అని ప్రశ్నించారు. ఈ అరెస్టును ఒక “హెచ్చరిక”గా అభివర్ణించిన చంద్రశేఖర్, ఇది కేవలం ఒక విడి సంఘటన కాదని, “ఏళ్ల తరబడి సాగిన బుజ్జగింపు రాజకీయాలు, తీవ్రవాద భావజాల వ్యాప్తి, కాంగ్రెస్-సిపిఎంల రాజకీయ ద్వంద్వ ప్రమాణాల” ఫలితమని ఆరోపించారు.
కేరళ భవిష్యత్తు “భారతదేశ అభివృద్ధి ప్రస్థానంతో మరింత లోతైన అనుసంధానం”లో ఉందని నొక్కిచెప్పిన ఆయన, “ప్రమాదకర రాజకీయాలకు” స్వస్తి పలికి “పనితీరు ఆధారిత రాజకీయాలకు” శ్రీకారం చుట్టాలని పిలుపిచ్చారు.

More Stories
విరాళాల చోరీ నెపంతో రామ మందిర్ ట్రస్ట్ లో ప్రభుత్వ జోక్యం తగదు!
చంపత్ రాయ్ రాజీనామా ఆమోదం.. కొత్త సారధిగా కృష్ణ మోహన్
పహల్గాం ఉగ్రదాడి ఛార్జిషీట్లో నిందితుడిగా ఎల్ఈటి చీఫ్ హఫీజ్