కాళేశ్వరం అవినీతిపై రేవంత్ రెడ్డికి హఠాత్తుగా మమకారం!

కాళేశ్వరం అవినీతిపై రేవంత్ రెడ్డికి హఠాత్తుగా మమకారం!
కాళేశ్వరం అవినీతిపై రేవంత్ రెడ్డికి ఉన్న ఈ హటాత్తు ‘మమకారం’ వెనుక రహస్యం ఏంటో ప్రజలకు సమాధానం చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు డిమాండ్ చేశారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. “ఏక్ దేశ్.. ఏక్ విధాన్.. ఏక్ ప్రధాన్” అనే మహోన్నత సంకల్పంతో అఖండ భారత సాధన కోసం జీవితాంతం కృషి చేసిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు  నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి.
రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై, శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై అటు కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్న రాజకీయ నాటకంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  కాలేశ్వరం ప్రాజెక్ట్‌ విషయంలో జియో టెక్నికల్ రిపోర్టులు, ఇతర సాంకేతిక పరీక్షల ద్వారా డ్యాం సేఫ్టీ చర్యల్లేవని ‘నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ’  స్పష్టం చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రిపేర్ పనులు ప్రారంభించకపోవడం వారి ఘోర నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. 
 
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్ట్‌ను ఒక ‘ఏటీఎం’లా మార్చుకుని, కేవలం డబ్బు, అహంకారంతోనే తరతరాలుగా రాజకీయం చేయొచ్చని భావించిందని విమర్శించారు.  ఇప్పుడు అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి  కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతిని పూర్తిగా మర్చిపోయారని, అక్కడ జరిగిన అవినీతిపై ఎలాంటి కఠిన చర్యలు లేకుండా, కేవలం కొందరు అధికారులపై నామమాత్రంగా చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. 

మరోవైపు హైదరాబాద్ నగరంలో ‘హైడ్రా’ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో హైడ్రా పేరుతో పేదవాళ్ల ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా కూలగొడుతున్న ప్రభుత్వం.. ఎంఐఎం పార్టీకి సంబంధించిన అక్రమ కట్టడాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. 
ఎంఐఎంకు సంబంధించిన ‘ఫాతిమా విద్యాసంస్థల విషయంలో స్పష్టంగా నిబంధనలను ఉల్లంఘించిందని, అదేవిధంగా స్వయంగా విద్యాశాఖ కూడా అనుమతులే లేవని కోర్టుకు తెలపడాన్ని ఆయన గుర్తుచేశారు.
అంతేకాకుండా హైకోర్టు సైతం తప్పుపట్టిందని గుర్తుచేశారు. స్వయంగా హైడ్రా కూడా ఇది ఆక్రమణే అని అంగీకరించినప్పటికీ, అంత స్పష్టంగా కనబడుతున్న ఆ స్కూల్‌ను, భవనాలను ఎందుకు కూల్చివేయడం లేదని నిలదీశారు.  కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఐఎంతో ఉన్న దోస్తానా వల్లే ఈ వివక్ష చూపుతున్నారని, హైడ్రా అంటే కేవలం పేదవాళ్ల ఇళ్లను కూల్చడానికే ఉందా? అని దుయ్యబట్టారు.