అయోధ్య రామాలయానికి భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల సొమ్మును స్వాహా చేసిన నిందితులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ‘రాముడి’ సొమ్ముతో అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేస్తూ, వారి అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సిద్ధమైంది. ఈ విరాళాల దొంగతనం కేసులో కీలక నిందితుడిగా ఉన్న లవ్‌కుశ్ మిశ్రా నిర్మిస్తున్న రెండంతస్తుల భవనానికి అయోధ్య అభివృద్ధి సంస్థ (ఎడిఎ) తాజాగా అధికారికంగా నోటీసులు జారీ చేసింది.
అయోధ్య-లక్నో జాతీయ రహదారి సమీపంలోని బన్బీర్పూర్ వద్ద తన భార్య పేరిట కొనుగోలు చేసిన స్థలంలో లవ్‌కుశ్ మిశ్రా ఈ ఇంటిని నిర్మిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఈ ఇంటిపై వారంలోగా వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో కూల్చివేత చర్యలు ఉంటాయని నోటీసుల్లో హెచ్చరించారు. ఈ భారీ విరాళాల కుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణను మరింత వేగవంతం చేసింది.
లవ్‌కుశ్ మిశ్రాతో పాటు అరెస్ట్ అయిన ఎనిమిది మంది నిందితుల ఇళ్లలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించి, లక్షలాది రూపాయల నగదు, బంగారం, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నివాసాల నుండి పోలీసులు ఇప్పటివరకు మొత్తం రూ. 7,00,25,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా స్వాధీనం చేసుకున్న వాటిలో, అవినాష్ శుక్లా ఇంటి నుండి రూ. 20 లక్షలు, కరుణేష్ పాండే నుండి రూ. 18 లక్షలు లభించాయి.
అలాగే, అనుకల్ప్ మిశ్రా నివాసం నుండి మరో రూ. 16 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అధికారులు అవినాష్ శుక్లా ఇంటి నుండి రూ. 20 లక్షలతో పాటు, రూ. 500 విలువైన 3,609 నోట్లు, 1,121 అమెరికన్ డాలర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నెలకు రూ 20,000 జీతంతో పనిచేస్తున్న నిందితులు ఇంత భారీ మొత్తంలో ఆస్తులు ఎలా సంపాదించారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
మరోవైపు, గత ఐదేళ్ల కాలంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందిన మొత్తం విరాళాలు, నిధులపై సిట్ అధికారులు ప్రత్యేకంగా ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఈ అవినీతి నెట్వర్క్ వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాలను పూర్తిగా వెలికితీసేందుకు సీసీటీవీ ఫుటేజీలను, బ్యాంకు లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
వారణాసి సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థపై దృష్టి!
దర్యాప్తు వర్గాల సమాచారం ప్రకారం, అరెస్టు అయిన ఎనిమిది మంది నిందితులలో ఆరుగురు వారణాసికి చెందిన ‘సైనిక్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో జీతభత్యాలు పొందుతున్నారు. అయోధ్యలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ ఘాట్ శాఖకు ఈ ఏజెన్సీ సిబ్బందిని సరఫరా చేసిందని వర్గాలు తెలిపాయి. నగదు లెక్కింపు కార్యకలాపాలలో సహాయం చేయడానికి బ్యాంకు 19 మంది సిబ్బందిని కోరినట్లు సమాచారం.
వారణాసికి చెందిన ఈ ఏజెన్సీ ఉద్యోగులను నియమించి వారిని ఎస్బిఐకి పంపింది. ఆ తర్వాత, రామ మందిరంలో అందిన విరాళాలను లెక్కించి, నిర్వహించే బాధ్యతను వారికి అప్పగించారు. ఈ ఉద్యోగులు ఇద్దరు ప్రధాన నిందితులైన అనిల్ మిశ్రా, తిన్ను యాదవ్‌లకు సన్నిహితులని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, రామ్ మందిరం కోసం సిబ్బందిని నియమించే విషయంలో తమ ఏజెన్సీకి సిబ్బందిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లేదని సైనిక్ సెక్యూరిటీస్ డైరెక్టర్ గౌరవ్ సింగ్ తెలిపారు.
“ఈ విషయంలో, నియమించాల్సిన వ్యక్తుల పేర్లను ఎస్బీఐ మాకు అందించింది. వారి ఆధార్ కార్డులను పరిశీలించి వివరాలను ధృవీకరించిన తర్వాత మేము సంబంధిత పత్రాల ప్రక్రియను పూర్తి చేశాము. వీరు ఇంతకు ముందెన్నడూ మా వద్ద పని చేయలేదు,” అని సింగ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను సిట్ కు సమర్పించినట్లు కూడా ఆయన తెలిపారు.
వారిని మొదట హౌస్‌కీపింగ్ పనుల కోసం నియమించినప్పటికీ, ఆ తర్వాత విరాళాల నగదును లెక్కించి, నిర్వహించే అత్యంత సున్నితమైన బాధ్యతను వారికి అప్పగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తి నుంచి కొనుగోలు
ఇలా ఉండగా, ఆలయ నిర్మాణానికి శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వినియోగించిన భూమిలో కొంత భాగం ప్రభుత్వానిదేనని, ఆ భూమిని ఓ ప్రైవేటు వ్యక్తికి రూ.23.61 కోట్లు ఇచ్చి మరీ ట్రస్టు కొన్నట్లుగా తాజాగా వెల్లడైంది. ఈ వివాదాస్పద భూమి మొత్తం 1.59 ఎకరాలు. 2024 జనవరిలో అయోధ్య జిల్లా కలెక్టరు ఈ భూమిని ప్రభుత్వ భూమిగా ప్రకటించారు. అంటే, ప్రభుత్వ అనుమతితోనే ఈ భూమిని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయటంగానీ, లీజుకు తీసుకోవటంగానీ జరగాలి.
కానీ, దీనికి విరుద్ధంగా అదే ఏడాది ఏప్రిల్‌లో రామజన్మభూమి ట్రస్టు రూ.23.61 కోట్లతో మహంత్ మురళీదాస్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసింది. అయోధ్యలోనే ఉన్న హనుమాన్‌గఢి ఆలయం పూజారి మురళీదాస్. సదరు 1.59 ఎకరాల భూమి తనదేనని, తన పేరు మీద 1984 నుంచి రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉందని మురళీదాస్ చెబుతున్నారు. 1737లో అవధ్ నవాబు ఈ భూమిని హనుమాన్‌గఢీకి కేటాయించారని, తరతరాలుగా అది ఆలయ ప్రధాన పూజారి పేరు మీద కొనసాగుతూ వస్తోందని పేర్కొన్నారు.
కాగా, రామాలయ నిర్మాణం పనులు కొనసాగుతున్న నేపథ్యంలో 2023 జూన్‌లో 1.59 ఎకరాల భూమి రికార్డుల నుంచి మురళీదాస్ పేరును తొలగిస్తూ జిల్లా అదనపు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. యూపీ రెవెన్యూబోర్డు కూడా అదనపు కలెక్టరు ఉత్తర్వులనే సమర్థించింది. ఇంత జరిగాక మళ్లీ అదే కలెక్టరు సభ్యుడిగా ఉన్న రామజన్మభూమి ట్రస్టు రూ.23.61 కోట్లు చెల్లించి ఆ భూమిని మురళీదాస్ నుంచి కొనుగోలు చేయటమే ఇప్పుడు సంచలనం రేపుతోంది.

More Stories
టిఎంసి పేరు, ఎన్నికల గుర్తు కోరిన రెబెల్స్ .. ఈసీ నోటీసులు
మారుతీ సుజుకి మెగా ఖర్ఖోడా ప్లాంట్‌ను ప్రారంభించిన మోదీ, తకైచి
పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు