తమిళనాడులో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా గడవకముందే, ఆ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జరిగిన ఒక భారీ కుట్రను రాష్ట్ర నిఘా విభాగం భగ్నం చేసింది. విజయ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఏకంగా 15 మంది టీవీకే ఎమ్మెల్యేల చేత ఒకేసారి రాజీనామా చేయించేలా ఒక కన్సల్టెన్సీ సంస్థ ద్వారా స్క్రీన్ ప్లే నడిపినట్లు వెలుగులోకి వచ్చింది.
మరోవైపు తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి కె. పళనిస్వామితో డీఎంకే కుమ్మక్కైందని టీవీకే మంత్రి సీటీ నిర్మల్ కుమార్ ఆరోపించారు. “ఎంకే స్టాలిన్, ఉదయనిధి ఆదేశాల మేరకు, సెంథిల్ బాలాజీ వంటి కీలక డీఎంకే నేతలు మా ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారు. రూ.10 కోట్లు, రూ.20 కోట్లు లేదా రూ.50 కోట్ల వరకు డబ్బు ఆఫర్ చేస్తున్నారు. వారు సంప్రదించని ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేరు” అని పేర్కొన్నారు.
సెంథిల్ బాలాజీతో ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యక్తులు, ‘కరూర్ గ్యాంగ్’కు చెందిన వారు, ఈ వ్యవహారంలో నేరుగా ప్రమేయం ఉన్న వారిపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. “మా పార్టీకి చెందిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేను వారు సంప్రదించారు. ఒక్కొక్కరికి రూ.10 కోట్లు, రూ. 20 కోట్లు, చివరికి రూ. 50 కోట్ల వరకు డబ్బు ఆఫర్ చేస్తూ ఎర వేశారు” అని విమర్శించారు.
అయితే టీవీకే ఆరోపణలను డీఎంకే ఖండించింది. ఆ పార్టీ కట్టుకథ అల్లుతోందని డీఎంకే అధికార ప్రతినిధి ఎ. శరవణన్ విమర్శించారు. “దర్యాప్తు వివరాలు లీక్ చేయడం ద్వారా ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని సృష్టించాలని టీవీకే భావిస్తోంది. వారి వద్ద వాస్తవాలు లేవు. కేవలం ఒక కథనాన్ని సృష్టించడమే వారి లక్ష్యమని ఇది రుజువు చేస్తోంది” అని తెలిపారు. పక్కా ఆధారాలు ఉంటే సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేయాలని టీవీకే ప్రభుత్వాన్ని ఆయన సవాల్ చేశారు.

More Stories
ఖమేనీ అంత్యక్రియలకు నితిన్ నబిన్, ఖర్గే లకూ ఆహ్వానం
ఆచారాలు పాటించకపోతే హిందూ వివాహం చెల్లదు
వాట్సాప్‌లో యూజర్‌నేమ్ ఫీచర్ తో సైబర్ నేరాలు?.. కేంద్రం బ్రేకులు