తిరుమల తరహాలో యాదాద్రి అభివృద్ధి

తిరుమల తరహాలో యాదాద్రి అభివృద్ధి

* ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా మన్నె సత్యనారాయణ రెడ్డి

యాదగిరిగుట్ట (యాదాద్రి) పుణ్యక్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశా రు. యాదగిరిగుట్ట ఆలయ భూములు, నిర్మాణాలపై సమీక్ష జరుపుతూ  హరే రామ, హరే కృష్ణ ఫౌండేషన్‌కు మార్కెట్ రేటు ప్రకారమే భూమి కేటాయించాలని, వివిధ మఠాలు, కుల సంఘాలకు స్థలాలు ఇచ్చే అంశంపై స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానాన్ని రూపొందించాలని  ఆదేశించారు. 

అయితే, భూమిపై శాశ్వత యాజమాన్య హక్కులు మాత్రం టెంపుల్ బోర్డు వద్దే ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని సిఎం ఆదేశించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపిలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సహా దేవాదాయ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గుట్టపై గెస్ట్‌హౌస్‌ల నిర్మాణానికి ముందుకు వచ్చే దాతల జాబితాను సిద్ధం చేసి, విడతల వారీగా అనుమతులు ఇవ్వాలని, ఇందుకు కూడా తిరుమల మోడల్‌ను ప్రామాణికంగా తీసుకోవాలని సిఎం అధికారులకు సూచించారు. భూసేకరణ ప్రక్రియ కోసం తక్షణమే నిధులు మంజూరు చేయాలని ఆర్థిక శాఖను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 

అలాగే, ఆలయ నిర్మాణంపై ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి, వారం రోజుల్లో తుది నివేదిక సమర్పించాలని అధికారులను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలను పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో అంతర్జాతీయ స్థాయి టూరిజం సర్క్యూట్‌గా మార్చాలని సిఎం పిలుపునిచ్చారు.

కాగా, యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా ఎంఎస్‌ఎన్ గ్రూప్ చైర్మన్ అయిన సత్యనారాయణ రెడ్డికి  బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. అలానే 10 మంది బోర్డు సభ్యులను, ఏడుగురు ఎక్స్ అఫీషియో సభ్యుల పేర్లను వెల్లడించారు. యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదల సురేఖ, చిలప్పగారి విజయరాజం, విజయేందర్ తుల్ల, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కంఠమని, ఎం. రాఘవేంద్ర రావు, డి. లక్మీనారాయణ నాయక్, ట్రస్టీ వ్యవస్థాపకులు నియమితులయ్యారు.

ప్రభుత్వ ప్రధాన, రెవెన్యూ, దేవాదాయ శాఖ కార్యదర్శి.. తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, వైటీడీఏ వైస్ చైర్మన్, యాదగిరిగుట్ట దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి, స్థానాచార్యులు లేదా.. సీనియర్ ప్రధాన అర్చకులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరించనున్నారు.