జన్మతః పౌరసత్వాన్ని సమర్థించిన అమెరికా సుప్రీంకోర్టు

జన్మతః పౌరసత్వాన్ని సమర్థించిన అమెరికా సుప్రీంకోర్టు
జన్మతః పౌరసత్వ హక్కు రద్దు విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అమెరికా సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేయాలన్న ట్రంప్‌ ప్రతిపాదనలను అమెరికా సుప్రీం కోర్టు తిరస్కరించింది. జన్మతః పౌరసత్వాన్ని సమర్థించింది.  అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్‌, జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
విదేశాలకు చెందిన దంపతులకు అమెరికాలో పిల్లలు పుట్టినప్పటికీ వారికి ఆ దేశ పౌరసత్వం వర్తించబోదని ఆయన కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. దీంతో చట్టాన్ని రద్దుచేయడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలకు గండిపడింది.  గతేడాది అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తాను చెలాయిస్తున్న విస్తృత అధికారాలకు పరాకాష్టగా ట్రంప్ తీసుకొచ్చిన ప్రతీకార సుకాలను కొన్ని నెలల క్రితమే కోర్టు రద్దు చేసింది. 
గత వారం వలసదారులను దేశ బహిష్కరణ నుంచి రక్షణ కల్పించే నిబంధనలను రద్దుచేయడానికి ట్రంప్‌నకు అనుమతించిన తీర్పుతో సహా ఇతర వలస కేసుల్లో న్యాయమూర్తులు అధ్యక్షుడి అధికారాలకే మద్దతు పలికారు.  కానీ, తాజా నిర్ణయంలో మాత్రం కేవలం ఒక సంతకంతో పుట్టకతో వచ్చే పౌరసత్వం నిర్వచనాన్ని ట్రంప్ మార్చలేరని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. 
మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ అమెరికాలో చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలికంగా నివసిస్తున్న తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు కూడా 14వ సవరణలోని పౌరసత్వ నిబంధనకు అర్హులని పేర్కొన్నారు. ‘‘అప్పుడు, ఇప్పుడు కూడా పౌరసత్వం అనేది హక్కులను కలిగి ఉండే హక్కు మన రాజకీయ సమాజంలో స్వేచ్ఛగా భాగస్వామ్యం పంచుకోవడం, 14వ సవరణ రూపకర్తలు ఆ వాగ్దానాన్ని ‘ఈ దేశంలో జన్మించిన ప్రతి వ్యక్తికి’ విస్తరించారు. ఈ రోజు మనం ఆ వాగ్దానాన్ని నిలబెడుతున్నాం’’ అని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ రాశారు.

కానీ, కోర్టులోని ఇతర ముగ్గురు కన్జర్వేటివ్ న్యాయమూర్తులు జస్టిస్ క్లారెన్స్ థామస్, జస్టిస్ శామ్యూల్ అలిటో, జస్టిస్ నీల్ గోర్సచ్‌లు మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. ఈ నిర్ణయం అమెరికా పౌరసత్వ విలువను తగ్గిస్తుందని, ఇది కాలపరీక్షకు నిలిచే అవకాశం లేదని థామస్ పేర్కొన్నారు. 
ట్రంప్ నియమించిన మరో న్యాయమూర్తి జస్టిస్ బ్రెట్ కావనాగ్ మాట్లాడుతూ తాను మరింత క్లిష్టమైన ప్రాతిపదికన ఈ ఆర్డర్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి ఉండేవాడ్ని అని తెలిపారు. ఈ ఉత్తర్వు 14వ రాజ్యాంగ సవరణను ఉల్లంఘించనప్పటికీ,  1952 నాటి వలస చట్టానికి విరుద్ధంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.