అరుణాచల్ సరిహద్దుల్లో ఎలాంటి చొరబాట్లు జరగలేదు

అరుణాచల్ సరిహద్దుల్లో ఎలాంటి చొరబాట్లు జరగలేదు
భారత భూభాగంలోకి చైనా సైన్యం (పీఎల్ఏ) చొరబడిందంటూ వస్తున్న వార్తలపై భారత సైన్యం తీవ్రంగా స్పందించింది. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లోకి చైనా బలగాలు చొరబడ్డాయని, భారత భూభాగం లోపల సైనిక శిబిరాలను కూడా ఏర్పాటు చేశాయంటూ మీడియాలో వస్తున్న నివేదికలు ముమ్మాటికీ తప్పని,  వాటిలో ఎలాంటి నిజం లేదని ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రచారాలన్నీ పూర్తిగా ఆధార రహితమైనవని కొట్టిపారేసింది. 
 
అరుణాచల్ సరిహద్దుల్లో ప్రస్తుతం ఎలాంటి చొరబాట్లు జరగలేదని, సరిహద్దులన్నీ సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సుబన్‌సిరి జిల్లా తక్సింగ్ ప్రాంతానికి చెందిన ‘నా వెల్ఫేర్ సొసైటీ’ (ఎన్డబ్ల్యూఎస్) అనే స్థానిక సామాజిక సంస్థ జిల్లా డిప్యూటీ కమిషనర్‌కు సమర్పించిన వినతిపత్రం ఆధారంగా జాతీయ మీడియాలో ఈ చొరబాటు వార్తలు వెలువడ్డాయి. 
 
జూన్ 26న సమర్పించిన ఆ లేఖలో గత 10 నుంచి 15 ఏళ్లుగా తక్సింగ్ సర్కిల్ పరిధిలోని సరిహద్దు ప్రాంతాల్లో చైనా పీఎల్ఏ క్రమంగా తన ఉనికిని విస్తరిస్తోందని ఆ సంస్థ ఆరోపించింది. స్థానిక ప్రజలు సాంప్రదాయకంగా వేట కోసం, పశువుల మేత కోసం ఉపయోగించే సరిహద్దు అటవీ భూములను ఆక్రమించి చైనా రోడ్లు, వంతెనలు, సైనిక క్యాంపులను నిర్మించిందని ఆందోళన వ్యక్తం చేసింది. 
 
ముఖ్యంగా 2020 నుంచి చైనా సైన్యం ఓయింగ్, పానియర్, మార్పన్, పొత్రాంగ్ లేక్, తిందింగ్‌తాంగ్ అనే ఐదు వ్యూహాత్మక ప్రాంతాలను ఆక్రమించిందని ఆ మెమోరాండంలో పేర్కొన్నారు. ఇవి తక్సింగ్ హెడ్‌క్వార్టర్స్‌కు సమీపంలో ఉండటమే కాకుండా స్థానికులకు సాంస్కృతిక, మతపరమైన ప్రాధాన్యత ఉన్న ప్రదేశాలని తెలిపారు. చైనా మరింత ముందుకు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ దానికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా అధికారులకు అందజేశారు.
స్థానిక సంస్థ చేసిన ఆరోపణలను భారత సైన్యం తీవ్రంగా ఖండించింది. ఇవి ఇటీవలి కాలంలో జరిగిన చొరబాట్లు కావని, మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని తేల్చి చెప్పింది. సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్న తమ సైనికుల నిబద్ధతపై పూర్తి నమ్మకం ఉంచాలని కోరింది. “అరుణాచల్ ప్రదేశ్లో పీఎల్ఏ ఇటీవల చొరబాట్లకు పాల్పడిందని, శిబిరాలను ఏర్పాటు చేసిందని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. వాటిని మేము నిశితంగా గమనించాం. ఆ రిపోర్టులు తప్పుడువి, వాటికి ఎలాంటి ఆధారాలు లేవు” అని స్పష్టం చేసింది.
 
కాగా భారత్-చైనా సరిహద్దు వ్యవహారాలపై బీజింగ్‌లో నిర్వహించిన 35వ వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూఎమ్‌సీసీ) ఉన్నత స్థాయి సమావేశం జరిగిన కొన్ని వారాలకే ఈ వివాదం తెరపైకి వచ్చింది.