కృష్ణ జన్మభూమి విముక్తికి మద్దతు ఇవ్వండి అఖిలేష్ జీ!

కృష్ణ జన్మభూమి విముక్తికి మద్దతు ఇవ్వండి అఖిలేష్ జీ!
* యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సవాల్ 
 
రామమందిర విరాళాల వివాదంపై సాగుతున్న రాజకీయ మాటల యుద్ధంలో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం నాడు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయోధ్యపై యాదవ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆదిత్యనాథ్, రామ జన్మభూమి ఉద్యమం తరహాలోనే మథురలోని కృష్ణ జన్మభూమి ఉద్యమానికి మద్దతుగా బహిరంగంగా మాట్లాడాలని ఆయనకు సవాల్ విసిరారు. 
 
హథ్రాస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆదిత్యనాథ్ పాల్గొంటూ “అఖిలేష్ జీ, శ్రీరాముని భక్తులు ఇప్పటికే అయోధ్య రూపురేఖలను మార్చేశారు. దాని గురించి మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. పశ్చాత్తాపపడండి, ఒక్కసారైనా రామ్ లల్లాను దర్శించుకోండి. కనీసం అదైనా మీకు కొంత వివేకాన్ని ప్రసాదిస్తుంది. ఇప్పుడు శ్రీకృష్ణుడి కోసం కూడా మనం ఏదైనా చేసేలా సిద్ధం కండి” అంటూ హితవు చెప్పారు.
 
యాదవ్ ఇప్పటివరకు అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించలేదు. ఆదివారం ప్రయాగ్‌రాజ్ పర్యటనలో ఉన్న యాదవ్, బీజేపీ “దేశం ప్రథమం” అనే విధానం నుండి “విరాళం ప్రథమం”అనే ధోరణికి మారిందని ఆరోపించారు. అలాగే అధికార పార్టీ “4సి సూత్రం” — అంటే చందా (విరాళాలు), చోరీ (దొంగతనం), చతురాయి (కుయుక్తి), చలాకీ (మోసం) — ఆధారంగా పనిచేస్తోందని విమర్శించారు. 
 
రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్యను “ధర్మ నగరి” (పవిత్ర నగరం)గా మారుస్తానని శనివారం యాదవ్ చేసిన ప్రకటన విని ఆశ్చర్యం కలిగిందని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాలలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రజల విశ్వాసంతో చెలగాటం ఆడారని యాదవ్ శనివారం ఆజంగఢ్‌లో విమర్శించారు. 
 
“మీ ప్రభుత్వం అయోధ్యను ధర్మ నగరిగా మారుస్తుందని అంటున్నారు. ఎలాంటి ధర్మ నగరిని తయారు చేస్తారు? అయోధ్యలో రామభక్తులపై కాల్పులు జరిపిన తన సొంత పార్టీ చరిత్ర గురించి సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు అవగాహన ఉండాలి,” అని ఆదిత్యనాథ్ ఎద్దేవా చేశారు. 1990లలో అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్, అయోధ్యలో కరసేవకులపై కాల్పులకు ఆదేశించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. 
 
ఎస్పీ అధినేతకు సవాలు విసురుతూ ఇలా పేర్కొన్నారు: “అఖిలేష్ జీ, ఇప్పుడు మథుర గురించి మాట్లాడండి. మీరు నిజంగా మిమ్మల్ని మీరు భక్తిభావం గల వ్యక్తిగా చూపించుకోవాలనుకుంటే, మథుర, బృందావన్, కృష్ణ జన్మభూమి గురించి బహిరంగంగా మాట్లాడండి. రామ జన్మభూమి విముక్తి ఉద్యమం లాగే, కృష్ణ జన్మభూమి విముక్తి కోసం కూడా ఒక ఉద్యమాన్ని ప్రారంభించాలని చెప్పండి.” 
 
“శ్రీకృష్ణుని జన్మస్థలం కూడా గౌరవానికి అర్హమైనది” అని నొక్కిచెప్పిన ఆయన, ఈ అంశంపై మాట్లాడే ధైర్యం ప్రతిపక్షాలకు లేదని ఆరోపించారు. కృష్ణ జన్మభూమికి సంబంధించి ఒక న్యాయపరమైన వివాదం నడుస్తోంది. శ్రీకృష్ణుని జన్మస్థలంలో ఉన్న ఆలయాన్ని కూల్చివేసిన తర్వాతే మథురలోని షాహీ ఈద్గా మసీదును నిర్మించారని హిందూ పక్షం వాదిస్తోంది. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, రామ భక్తుల కృషి ఫలితంగా అయోధ్య తన అస్తిత్వాన్ని తిరిగి పొందిందని, ఆ నగరానికి సమాజ్‌వాదీ పార్టీ ఆమోదం అవసరం లేదని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. “అఖిలేష్ యాదవ్ అయోధ్య గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయన హయాంలోనే పోలీస్ స్టేషన్లు, జైళ్లలో జన్మాష్టమి (శ్రీకృష్ణుని జన్మదినం) వేడుకలు నిలిపివేశారు. ‘కాన్వార్ యాత్ర’పై నిషేధం విధించారు,” అని ఆయన ఆరోపించారు.
 
“అయోధ్య కోసం మొసలి కన్నీరు కారుస్తున్న అఖిలేష్ యాదవ్, రామ జన్మభూమి ఉద్యమం తరహాలోనే శ్రీకృష్ణ జన్మభూమి కోసం ఉద్యమం చేపట్టాలనే ఆలోచనకు బహిరంగంగా మద్దతు ఇచ్చి, కృష్ణ జన్మభూమి గౌరవాన్ని పునరుద్ధరించడానికి ఎందుకు ముందుకు రారు?” అని ప్రశ్నించారు. 
 
 “మేము మథుర, బృందావన్‌లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తున్నాము. కానీ అఖిలేష్ యాదవ్ ఆ పేరును ప్రస్తావించడానికి కూడా సాహసించలేరు. ఎందుకంటే ‘ముల్లాలు’, ‘మౌల్వీల’ ముందు తలవంచడం తప్ప ఆయనకు వేరే ఎజెండా లేదు,” అని ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
కాంగ్రెస్‌పై కూడా విమర్శలు గుప్పిస్తూ, 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ రెండూ రాజ్యాంగం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాయని ఆయన విమర్శించారు. “1975 జూన్‌లో అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తిని గొంతు నులిమి చంపింది కాంగ్రెస్ పార్టీయే,” అని ఆయన గుర్తు చేశారు. 
 
“అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న సమయంలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అరెస్టు అయ్యారు. పార్టీ పితామహుడైన దివంగత ములాయం సింగ్ యాదవ్ వారసత్వాన్ని అవమానిస్తూ, అదే సమాజ్‌వాదీ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్‌తో చేతులు కలిపింది,” అని ఆయన చురకలు అంటించారు. 
 
హత్రాస్‌లో, ముఖ్యమంత్రి రూ. 500 కోట్లకు పైగా పెట్టుబడితో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, వాటిని ప్రారంభించారు. గతానికి భిన్నంగా, జూన్ 26న రాష్ట్రవ్యాప్తంగా మొహర్రంను “పూర్తిగా శాంతియుతంగా” పాటించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడానికి ముందుగా భద్రత, రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.