రామమందిర విరాళాల చోరీ ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అయోధ్యలోని రామమందిరానికి వచ్చిన విరాళాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై అయోధ్య పోలీసులు ఎనిమిది మందితో పాటు మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తమ ప్రాథమిక నివేదికను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించిన రెండు రోజుల తర్వాత, గురువారం నాడు రామ జన్మభూమి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది.
అయోధ్య ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకల దుర్వినియోగంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కొద్ది గంటల్లోనే, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎనిమిది మందిని గురువారం అరెస్టు చేశారు. వారిని పోలీసు కస్టడీకి తరలించగా అధికారులు వారిని విచారిస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం, ఎఫ్ఐఆర్లో నిందితులుగా అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామ్ శంకర్ యాదవ్ అలియాస్ తిను పేర్లను చేర్చారు.
వీరిలో ఆరుగులు ఆలయంలో విరాళాల నగదు లెక్కించే ఉద్యోగులే కావడం విశేషం. సీసీటీవీ కెమెరాల్లో నగదును వీరు అక్రమంగా తీసుకుంటునన దృశ్యాలు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. అయితే, ఎఫ్ఐఆర్ లో శ్రీ రామ్ జన్మభూమి ట్రస్ట్ సీనియర్ సభ్యులైన చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల పేర్లు లేవని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. చంపత్ రాయ్ సన్నిహిత అనుచరుడుగా భావిస్తున్న తిన్ను యాదవ్ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.“ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. సిట్ జరిపే నిష్పాక్షిక దర్యాప్తు వాస్తవాలను వెలుగులోకి తెస్తుందని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు” అని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ప్రాథమిక నివేదికలోని సిఫార్సుల మేరకు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కృష్ణ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది.
ఆలయ విరాళాల నిర్వహణలో ఆర్థిక అవకతవకల ఆరోపణలతో రాజకీయంగా చర్చనీయాంశమైన ఈ వివాదంలో, ఎఫ్ఐఆర్ నమోదు కావడం మొదటి అధికారిక చర్యగా నిలిచింది. ఈ వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్యలు కొనసాగుతున్నాయని, రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం.
ప్రాథమిక విచారణ సమయంలో సేకరించిన సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలపై అధికారులు ప్రధానంగా ఆధారపడినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్‌లో విరాళాల డబ్బును దొంగిలిస్తున్నట్లు కనిపించిన వ్యక్తులపై, అలాగే వారికి సహకరించినట్లు అనుమానిస్తున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆరోపిత దొంగతనాల నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న వ్యక్తులందరి పాత్రను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు.
మరిన్ని ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించే కొద్దీ, ఈ విచారణ మరిన్ని అరెస్టులకు దారితీయవచ్చని అధికారులు భావిస్తున్నారు. పోలీసు అధికారులు భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్)లోని సెక్షన్లు 306, 316(5), 317(4), 317(5), 61, 3(5)లను ప్రయోగించారు. ఈ సెక్షన్ల పరిధిలోకి ఉద్దేశపూర్వక, అలవాటుగా చేసే దొంగతనం, దొంగతనానికి సహాయపడటం, ప్రభుత్వ ఉద్యోగి లేదా సంస్థ ఉద్యోగి ద్వారా నేరపూరిత విశ్వాస భంగం, నేరపూరిత కుట్ర వంటి నేరాలు వస్తాయి.
ఎఫ్ఐఆర్లో, నేరపూరిత కుట్ర కింద, ఉద్దేశపూర్వక దొంగతనం, అలవాటుగా చేసే దొంగతనం, దొంగతనానికి సహాయపడటం, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ద్వారా నేరపూరిత విశ్వాస భంగం వంటి ఆరోపణలు వివరంగా ఉన్నాయి. నిధుల దుర్వినియోగం, మోసానికి సంబంధించిన నిబంధనలను కూడా వర్తింపజేశారు. ట్రస్టులో పదవీరీత్యా సభ్యుడిగా ఉన్న అదనపు ప్రధాన కార్యదర్శి (హోమ్) సంజయ్ ప్రసాద్‌కు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ సమర్పించిన ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు.

More Stories
వచ్చేవారం బెంగాల్ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు
శివరాజ్‌సింగ్ తనయుడుకు విచారం వ్యక్తం చేసిన రాహుల్
‘నా బాడీ నా ఇష్టం అంటే, చూసేవాడి కళ్లు వాడి ఇష్టం’