టీ20ల్లో తెలుగమ్మాయి వరల్డ్‌ నంబర్ 1 ర్యాంక్

టీ20ల్లో తెలుగమ్మాయి వరల్డ్‌ నంబర్ 1 ర్యాంక్

ఏడాది క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన శ్రీ చరణి నంబర్ 1 ర్యాంక్ పట్టేసింది. నిలకడగా రాణిస్తున్న ఈ తెలుగమ్మాయి అంతర్జాతీయ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న పొట్టి వరల్డ్‌కప్‌లో తిప్పేస్తున్న ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ టాప్ ర్యాంక్‌కు ఎగబాకింది.

ఐసీసీ మంగళవారం ప్రకటించిన మహిళల టీ20 బౌలర్ల జాబితాలో భారత స్పిన్నర్ శ్రీ చరణి అగ్రస్థానం సాధించింది. నిరుడు జూన్ 28న ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టిన చరణి తన స్పిన్ మ్యాజిక్‌తో టీమిండియా విజయాల్లో కీలకవుతూనే వ్యక్తిగతంగా తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకుంది.  గతేడాది స్వదేశంలో 14 వికెట్లతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకమైన తెలుగమ్మాయి.

పదో సీజన్ టీ20 వరల్డ్‌కప్‌లోనూ చెలరేగిపోతోంది.  టీ20 ప్రపంచ కప్ 2026లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనే 10 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచింది శ్రీచరణి.  దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్ ఓడినప్పటికీ.. చరణి (3/24) అద్భుత బౌలింగ్‌తో మెరిసింది. ఈ ప్రదర్శనతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి(753 పాయింట్లు) ఇంగ్లాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లిన్సే స్మిత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.

ఈ ప్రపంచకప్‌ 2026 టోర్నీలో శ్రీ చరణి ప్రదర్శన భారత జట్టుకు ప్రధాన బలంగా మారింది. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే నెదర్లాండ్స్‌పై 4/19తో చెలరేగిన ఆమె, అంతకుముందు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 3/21తో సత్తా చాటింది. ఈ టోర్నీలో తాజా ప్రదర్శనతో ప్రపంచకప్‌2020లో భారత స్పిన్నర్ పూనమ్ యాదవ్ నెలకొల్పిన అత్యధిక వికెట్ల (10) రికార్డును చరణి సమం చేసింది. గ్రూప్ దశలో ఇంకా రెండు మ్యాచులు ఉండటంతో శ్రీచరణి త్వరలో పూనమ్‌ను దాటేసి సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఫలితంగా ర్యాంకింగ్స్‌లో చరణి టాప్‌లో నిలవగా, ఇంగ్లండ్‌కు చెందిన చార్లీ డీన్‌, లిన్సే స్మిత్ వరసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకోగా, మాజీ వరల్డ్‌ నంబర్ 1 సోఫియా ఎకిల్‌స్టోన్ నాలుగుతో సరిపెట్టుకుంది. ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న పొట్టి వరల్డ్‌కప్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసినప్పటికీ భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు టాప్‌-5లో చోటు దక్కలేదు.

టాప్ టీ20 బౌలర్లు 

1. శ్రీ చరణి(భారత్‌) – 753 పాయింట్లు
2. చార్లీ డీన్‌(ఇంగ్లండ్) – 733 పాయింట్లు
3. లిన్సే స్మిత్‌(ఇంగ్లండ్) – 726 పాయింట్లు
4. సోఫియా ఎకిల్‌స్టోన్‌(ఇంగ్లండ్) – 722 పాయింట్లు

5. సాదియా ఇక్బాల్ (పాకిస్థాన్) – 714 పాయింట్లు
6. నొన్‌కులులెకొ మ్లాబా(దక్షిణాఫ్రికా) – 713 పాయింట్లు
7. లారెన్ బెల్(ఇంగ్లండ్) – 710 పాయింట్లు
8. దీప్తి శర్మ (భారత్‌) – 708 పాయింట్లు