ఇరాన్ యుద్ధానికి ముగింపు పలికే తాత్కాలిక ఒప్పందంలో భాగంగా ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ అమెరికా ఆర్థిక శాఖ 60 రోజులపాటు చెల్లుబాటు అయ్యే లైసెన్సును జారీ చేసింది. ఈ అనుమతి ఇరాన్ చమురు ఉత్పత్తి, సరఫరా, అమ్మకాలకు వీలు కల్పిస్తుంది. ఇది ఆగస్టు 21 వరకు అమల్లో ఉంటుంది. ఈ పరిణామంతో ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకునే దేశాలకు తాత్కాలిక ఊరట లభించనుంది.
ఇది ప్రపంచ ఇంధన మార్కెట్లలో కూడా అనిశ్చితిని తొలగిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి పూర్తి స్థాయిలో తిరిగి తెరుచుకుంటే చమురు సరఫరా మరింత సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్విట్జర్లాండ్‌లో ఇరాన్ ఉన్నతాధికారులతో తాను జరిపిన సుదీర్ఘ చర్చలు విజయవంతమైన తుది ఒప్పందానికి మంచి పునాది వేశాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పిన నేపథ్యంలో సోమవారం ఈ ఒప్పందం వెలుగులోకి వచ్చింది.
ఈ లైసెన్సును పునరుద్ధరించకపోతే అది ఆగస్టు 21న గడువు ముగిసే అవకాశం ఉంది. గత వారం అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా ఈ చర్య చేపట్టారు. దీనికి ప్రతిఫలంగా ఇరాన్ హొర్ముజ్ జలసంధిని తెరుస్తుంది. అంతేగాక ప్రాథమిక ఒప్పందానికి అనుగుణంగా వ్యవహరిస్తుందో లేదో పరిశీలించడానికి ఐఏఈఏ అణు పరిశీలకులను ఇరాన్ అనుమతిస్తుంది.
స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న నిర్మాణాత్మక చర్చలకు అనుగుణంగా, హొర్ముజ్ జలసంధి గుండా స్వేచ్ఛా, బహిరంగ రవాణాను అనుమతించడానికి, అలాగే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) పరిశీలకులను తమ దేశంలోకి అనుమతించడానికి ఇరాన్ అంగీకరించింది అని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
అయితే క్యూబా, ఉత్తర కొరియా, ఉక్రెయిన్‌లోని క్రిమియా ప్రాంతానికి చమురును విక్రయించడానికి ఈ అనుమతి (లైసెన్సు) అవకాశం కల్పించదు. కాగా, ఇరాన్ అణ్వాయుధాలను సొంతం చేసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆ దేశం భవిష్యత్ ఒప్పందాలకు కట్టుబడి ఉండకపోతే అవసరమైన చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోమని హెచ్చరించారు.
ప్రపంచ ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉన్నప్పటికీ అణ్వాయుధాల వ్యాప్తిని అడ్డుకోవడం మరింత ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు యుద్ధానికి ముందు ఉన్న పరిస్థితులు హర్మూజ్‌లో ఇకపై ఉండవని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ వ్యూహాత్మక సముద్ర మార్గాన్ని భవిష్యత్తులో ఇరాన్ తన విధానాల ప్రకారమే నిర్వహిస్తుందని, అయితే అంతర్జాతీయ సముద్ర నిబంధనలను గౌరవిస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ ఘాలిబఫ్ ప్రకటించారు.
More Stories
ఖతార్ గ్యాస్ ప్లాంట్‌లో 12 మంది భారతీయులు మృతి
ఇరాన్ ఒప్పందం కోసం 60 రోజుల రోడ్‌మ్యాప్ ఖరారు
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా