కరోనా వ్యాక్సిన్ తో హృద్రోగాలు 40 శాతం తగ్గాయి

కరోనా వ్యాక్సిన్ తో హృద్రోగాలు 40 శాతం తగ్గాయి
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదం 40 శాతం వరకు తక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ఇటీవలి పలు అధ్యయనాలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో గుండె సంబంధిత తీవ్రమైన సమస్యలు తక్కువగా కనిపించాయని నివేదించాయి. సాధారణంగా ముఖ్యంగా కరోనా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే గుండెపోటు, స్ట్రోక్, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యల ప్రమాదాన్నిఈ వ్యాక్సినేషన్ తగ్గించగలదని పరిశోధనలలో తేలింది.
 
‘యూరోపియన్ హార్ట్ జర్నల్’లో ప్రచురితమైన గోథెన్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఈ తాజా అధ్యయనం, స్వీడన్‌లోని 80 లక్షల మందికి పైగా వయోజనుల డేటాపై ఆధారపడి ఉంది.కరోనా టీకా ప్రక్రియ ప్రారంభమైన 2020 డిసెంబర్ చివరి నుండి 2022 చివరి వరకు, జాతీయ ఆరోగ్య సంరక్షణ రిజిస్టర్ల ద్వారా వీరి ఆరోగ్య స్థితిని పర్యవేక్షించారు.
“కరోనా టీకా తర్వాత గుండె సంబంధిత సమస్యల ముప్పులో కనిపించిన పెరుగుదల తాత్కాలికమైనది. ఇది తీవ్రమైన అనారోగ్య సమస్యలకు వర్తించదు,” అని ప్రొఫెసర్ నైబర్గ్ పేర్కొన్నారు. “మరోవైపు, పూర్తిస్థాయి టీకా తీసుకోవడం వల్ల గుండెపోటు, పక్షవాతం, గుండె వైఫల్యం వంటి కరోనా సంబంధిత తీవ్రమైన గుండె సమస్యల ముప్పు గణనీయంగా తగ్గింది. ఇది పూర్తిస్థాయి టీకా వల్ల కలిగే రక్షణ ప్రయోజనాలను నొక్కి చెబుతుంది” అని స్పష్టం చేశారు. 
 
అయితే, ఈ “40%” సంఖ్యను సరైన సందర్భంలో అర్థం చేసుకోవాలి. ప్రతి వ్యక్తిలో గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదం 40% తగ్గుతుంది అని కాదు. కొన్ని అధ్యయనాల్లో కరోనా సంబంధిత ప్రధాన గుండె-రక్తనాళ సంఘటనలు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో సుమారు 38–40% తక్కువగా కనిపించాయి. ఇతర పెద్ద అధ్యయనాల్లో వ్యాక్సినేషన్ తరువాత గుండెపోటు, స్ట్రోక్ సంభవాలు 10–27% వరకు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.  
 
కరోనా వైరస్ స్వయంగా రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. గుండె కండరాల వాపు కలిగించవచ్చు. స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. వ్యాక్సిన్ తీవ్రమైన కరోనా నుంచి రక్షణ ఇవ్వడం వల్ల ఈ సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం కరోనా వ్యాక్సిన్లు సాధారణంగా సురక్షితమైనవే అయినప్పటికీ, చాలా అరుదుగా ముఖ్యంగా యువకులలో ఎంఆర్ఎన్ఎ వ్యాక్సిన్ల తర్వాత మయోకార్డైటిస్ (గుండె కండరాల వాపు) వంటి దుష్ప్రభావాలు నమోదయ్యాయి. అయితే మొత్తం ప్రయోజనాలు ప్రమాదాల కంటే ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.