ఖతార్ రాజధాని దోహాకు 80 కిలోమీటర్ల దూరంలోని కీలక సహజ వాయువు ఎగుమతి కేంద్రం బార్జాన్ గ్యాస్ సప్లై ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. ఆదివారం రాత్రి రస్ లఫాన్ పారిశ్రామిక ప్రాంతంలోని బార్జాన్ గ్యాస్ సప్లై ప్లాంట్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 54 మంది గాయపడగా, మరో 18 మంది ఆచూకీ గల్లంతైంది. ఇక్కడి నుంచి దాదాపు 30 దేశాలకు గ్యాస్ ఎగుమతి అవుతోంది.
వీటిల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన జపాన్, దక్షిణ కొరియా, భారత్, ఐరోపా సమాఖ్య, చైనా వంటి దేశాలు ఉన్నాయి. మార్చి నెలలో ఇరాన్ దాడిలో రస్ లాఫాన్ ప్రాంతంలో మిసైల్ పడడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగిప్పటినుంచి ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని ఖతార్ ఎనర్జీ వెల్లడించింది. ఈ పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, మంటలు చెలరేగిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
ప్రమాదం జరిగినప్పటికీ, ఎటువంటి గ్యాస్ లీకేజీ లేదా ప్రజలకు ప్రమాదం కలిగించే పరిస్థితి లేదని అధికారులు స్పష్టం చేశారు. రస్ లఫాన్ ప్రాంతంలో భద్రతా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా గ్యాస్ ప్లాంట్ పరిసర ప్రాంతాలను తాత్కాలికంగా ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు. పేలుడు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
సాంకేతిక లోపమా, భద్రతా వైఫల్యమా లేదా ఇతర కారణాలా అన్నది దర్యాప్తు తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సాంకేతిక నిపుణుల బృందాలు ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించాయి. ప్రస్తుతం రక్షణ బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. సహజవాయువుల ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా ఖతార్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నది. బార్జన్ ప్లాంట్‌లో ప్రతి రోజు సుమారు 1.4 బిలియన్ క్యూబిక్ ఫీట్ల గ్యాస్‌ను అమ్మే సామర్థ్యం ఉన్నది
ఈ ఘటన ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఖతార్ ప్రపంచంలో అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతి దేశాల్లో ఒకటి. ఈ టెర్మినల్‌లో ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో సరఫరా ఒత్తిడి పెరగవచ్చు. ఇటీవల హర్మూజ్ జలసంధి పరిణామాల కారణంగా ఎగుమతులు ప్రభావితమవడంతో ఇప్పటికే ఖతార్ ఉత్పత్తి తగ్గించినట్లు తెలుస్తోంది.

More Stories
ఇరాన్ ఒప్పందం కోసం 60 రోజుల రోడ్‌మ్యాప్ ఖరారు
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా
అమెరికా- ఇరాన్ తొలివిడత సాంకేతిక అంశాలపై చర్చలు