వీణ విజయన్ కు మరోసారి ఈడీ నోటీసులు

వీణ విజయన్ కు మరోసారి ఈడీ నోటీసులు
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె టీ వీణకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. సీఎంఆర్‌ఎల్ అనే మైనింగ్ సంస్థతో ఆమె నడుపుతున్న ఐటీ కంపెనీ జరిపిన లావాదేవీల మీద ఈ నెల 29న వీణా తమ ఎదుగ వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.   వీణాకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ నోటీసులు ఇవ్వడం ఇది రెండోసారి. గతంలోనే ఒకసారి నోటీసులు ఇచ్చి విచారణ జరిపింది.
ఈ నెల 17న ఆమెను కోచిలోని ఈడీ ఆఫీసులో అధికారులు విచారించారు. దాదాపు తొమ్మిది గంటలకుపైగా ఆమెను విచారించారు. ఆమెపై పీఎంఎల్‌ఏ యాక్ట్ కింద నమోదైన కేసుపై ఈ విచారణ సాగుతోంది.  జూన్ 19న ఈడీ అధికారులు తిరువనంతపురంలోని ఆమె బ్యాంకు లాకర్లను కూడా తనిఖీ చేశారు.  మూడు రోజుల క్రితం జరిగిన విచారణలో ఆమె ఇచ్చిన వాంగ్మూలం, బ్యాంకు లాకర్ల తనిఖీల తర్వాత మరింత విచారణ అవసరమని ఈడీ అధికారులు భావించారు.
అందుకే ఆమెకు మరోసారి సమన్లు జారీ చేశారు. ఈ కేసులో మరో నలుగురికి కూడా అధికారులు ఇప్పటివరకు విచారించారు. సీఎంఆర్‌ఎల్ సంస్థ నుంచి వీణకు చెందిన ఐటీ సంస్థకు రూ.2.87 కోట్లు బదిలీ అయ్యాయని ఈడీ గుర్తించింది. ఏ సేవలు అందించకుండానే వీణ సంస్థకు చెల్లింపులు జరిగాయి. అలాగే, ఇతర లోన్లకు సంబంధించి కూడా అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపిస్తోంది. దీంతో వీటిని ఈడీ విచారిస్తోంది. 

మరోవైపు పినరయి కూతురును ఈడీ విచారించడంపై కేరళలో ప్రతిపక్ష ఎల్డీఎఫ్ కూటమి కేంద్రంపై విమర్శలు చేస్తోంది. రాజకీయంగా వేధించేందుకే ఈ విచారణ అని విమర్శిస్తున్నారు.