అయోధ్య అంశాన్ని 2027 అసెంబ్లీ ఎన్నికల్లోకి లాగే ప్రయత్నం 

అయోధ్య అంశాన్ని 2027 అసెంబ్లీ ఎన్నికల్లోకి లాగే ప్రయత్నం 
 
* వీహెచ్‌పీ కేంద్రీయ మార్గదర్శక మండలి హెచ్చరిక 
 
“అయోధ్య అంశాన్ని 2027 అసెంబ్లీ ఎన్నికల్లోకి లాగేందుకు జరుగుతున్న దుర్మార్గపు ప్రయత్నాల” పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) హెచ్చరించింది. “కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు రామమందిరాన్ని నిరంతరం వ్యతిరేకిస్తూ వచ్చాయి. కరసేవకుల అణచివేతకు, వారి మరణాలకు కూడా అవే బాధ్యత వహించాలి. రాముడు నిజమైన వ్యక్తి కాదని, కేవలం ఒక కల్పిత పాత్ర అని పేర్కొంటూ అవి సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను కూడా దాఖలు చేశాయి” అని గుర్తు చేసింది. 
 
హరిద్వార్‌లో జరిగిన రెండు రోజుల కేంద్రీయ మార్గదర్శక మండలి సమావేశంలో ఈ ఆరోపణలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం  నేడు, అవే పార్టీల వారు ఈ ఘటనపై విచారణ జరిపేందుకు అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదం అంటూ కొట్టిపారేసింది. ఒక క్రిమినల్ కేసు విచారణను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అప్పగించవచ్చా? అటువంటి విచారణలలో వారికి ఏమైనా అనుభవం ఉందా? అని ప్రశ్నించింది.
 
రాజకీయ పార్టీల సభ్యులు క్రిమినల్ విచారణలు చేపట్టడానికి చట్టం అనుమతిస్తుందా? పైగా, విచారణ ప్రారంభం కాకముందే వీరు తీర్పును ప్రకటించినట్లుగా కనిపిస్తోందని పేర్కొంటూఈ అంశాన్ని రాజకీయీకరించడాన్ని హిందూ సమాజం ఎప్పటికీ అంగీకరించదని  వీహెచ్‌పీ తేల్చి చెప్పింది.
 
రెండు రోజుల సమావేశంలో, రామమందిరం కోసం సేకరించిన విరాళాలలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై చర్చించిన వీహెచ్‌పీ  కేంద్రీయ మార్గదర్శక మండలి, సిట్ పరిధిని విస్తరించి  రామమందిరం పేరుతో నిధులు లేదా బంగారాన్ని సేకరించిన ఇతర ట్రస్టుల (రామాలయ ట్రస్ట్, రామ జన్మభూమి మందిర పునర్నిర్మాణ ట్రస్ట్‌తో సహా) ఖాతాలను కూడా పరిశీలించాలని కోరింది. ఏదైనా నిర్ధారణకు వచ్చే ముందు లేదా ఎవరిపైనైనా ఆరోపణలు చేసే ముందు దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూడాలని  వీహెచ్‌పీ  బోర్డు స్పష్టం చేసింది. 
 
ప్రతి పైసాకు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బాధ్యత వహిస్తుంది
 
ఆలయ నిర్వహణలో పారదర్శకతకు సంబంధించి చర్చించిన అనంతరం స్వామి జితేంద్రనంద్ సరస్వతి, విహెచ్పి  అధ్యక్షుడు అలోక్ కుమార్ దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేశారు. అయోధ్యలోని రామమందిరానికి సమర్పించిన నిధుల విషయంలో తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయని ఆ పేర్కొంటూ అలాగే, ‘రామ్ లల్లా’కు చెందిన ప్రతి పైసాకు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బాధ్యత వహిస్తుందని స్పష్టం చేసింది.
 
“ఈ విషయం వెలుగులోకి రాగానే, ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ట్రస్ట్ స్వయంగా ముఖ్యమంత్రిని కోరింది. దీనికి అనుగుణంగా ఒక ఉన్నత స్థాయి సిట్ ని ఏర్పాటు చేశారు. ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్  విచారణ కోసం సిట్ ముందు హాజరయ్యారు. దర్యాప్తులో పూర్తి సహకారం అందిస్తారు. ఎవరైనా సరే—వారు ఎవరైనప్పటికీ—తప్పు చేసినట్లు తేలితే కచ్చితంగా శిక్షించబడాలి,” అని తేల్చి చెప్పారు. 
 
అప్పటి ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు ఆదేశాల మేరకు 1995లో రామాలయ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. విరాళాల నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలను పరిశీలించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన  ముగ్గురు సభ్యుల సిట్ ఆరోపిత అవకతవకలపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. 
 
“ఈ దశలో అందరిపైనా ఆరోపణలు చేయడం సరికాదు. నిజాయితీ లేకుండా వ్యవహరించిన వారికి, కేవలం నిర్లక్ష్యం వల్ల తప్పు చేసిన వారికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం అవసరం. రామ జన్మభూమి మందిరానికి సంబంధించిన వ్యవస్థలన్నీ పూర్తిగా లోపరహితంగా ఉండేలా చూసుకోవడం అత్యవసరం. దీనికి సంబంధించి సిట్ నుండి సిఫార్సులు కూడా కోరారు. ఈ పనిలో ఇక ఏమాత్రం జాప్యం జరగకూడదు,” అని వీహెచ్‌పీ ఆ ప్రకటనలో పేర్కొంది. 
 
చంపత్ రాయ్‌ పై ఆరోపణలపట్ల నేతల అసహనం 
 
కాగా, వీహెచ్‌పీ  ఉపాధ్యక్షుడు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి అయిన చంపత్ రాయ్‌కు మద్దతుగా అనేకమంది  వీహెచ్‌పీ నేతలు బహిరంగంగా ముందుకు వచ్చారు. రాయ్‌కు మద్దతు తెలుపుతూ  వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధి విజయ్ శంకర్ తివారీ ఇలా పేర్కొన్నారు: 
 
“చంపత్ రాయ్ తన జీవితాన్ని రామమందిర ఉద్యమానికి అంకితం చేశారు. కెమిస్ట్రీ ఉపాధ్యాయుడి స్థాయి నుండి  వీహెచ్‌పీ  అంతర్జాతీయ ఉపాధ్యక్షుడిగా, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన ఆయన, అద్భుతమైన రామలల్లా ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి చూశారు. ఎలాంటి అవాస్తవ ఆరోపణలు ఆయన వ్యక్తిత్వాన్ని మలినం చేయలేవు. ఆయన జీవితమే రాముని పట్ల ఆయనకున్న భక్తికి నిదర్శనం!” అని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు. 
 
తనపై వచ్చిన వ్యక్తిగత ఆరోపణలను ఎదుర్కోవడంలో—అది క్షేత్రస్థాయిలో కావచ్చు, దుష్టశక్తులను ఎదిరించడంలో కావచ్చు లేదా న్యాయస్థానంలో కావచ్చు—రాయ్ ఎప్పుడూ దృఢంగా నిలబడ్డారని, ఆయన ఏమాత్రం చలించే వ్యక్తి కాదని తివారీ స్పష్టం చేశారు. “అబద్ధం ఆయుష్షు చాలా తక్కువ. సత్యమే ఎప్పుడూ జయిస్తుంది.” విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ మొత్తం వ్యవహారాన్ని నిర్వహించిన తీరు, రాయ్‌పై ఆరోపణలను ప్రచారం చేసిన విధానం పట్ల వీహెచ్‌పీ లోని సీనియర్ నేతలు అసహనంతో ఉన్నారు.
 
“ట్రస్ట్ పనితీరు పట్ల సంతోషంగా లేని కొందరు, దానికి చెడ్డపేరు తీసుకురావడానికి ఇలాంటి వదంతులను సృష్టిస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం, దీనిని జాగ్రత్తగా పరిశీలించాలి. రామ్ లల్లా కోసం తమ జీవితకాలం పాటు శ్రమించిన సీనియర్ నేతలను ఇలాంటి వివాదాల్లోకి లాగడం ఆమోదయోగ్యం కాదు,” అని ఒక సీనియర్  వీహెచ్‌పీ  నేత ఒకరు హెచ్చరించారు. 
 
అఖిల భారతీయ సంత్ సమితి ప్రధాన కార్యదర్శి స్వామి జితేంద్రనంద్ సరస్వతి ఇలా తెలిపారు: “ముందుగా, ‘స్కామ్’ (అక్రమ కుంభకోణం) అనే పదాన్ని ఉపయోగించడం సరైనదని నేను భావించడం లేదు. విరాళాలు, కానుకల లెక్కలకు సంబంధించిన కొన్ని అక్రమాలు, లోపాలకు సంబంధించిన విషయం ఇది. ఆలయ నిర్మాణం కోసం ప్రజలు ఈ విరాళాలను ఇచ్చారు, కాబట్టి ఆ నిధుల నిర్వహణకు సంబంధించిన అంశం ఇది.” 
 
“లెక్కల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా కొన్ని తేడాలు తలెత్తినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఒక సిట్ దీనిపై విచారణ జరుపుతోంది. సిట్ తన దర్యాప్తును పూర్తి చేసే వరకు మనం సంయమనంతో ఉండి, తుది ఫలితాల కోసం వేచి చూడాలి. అదే సమయంలో, ఎంతటి ప్రభావశీలురైన లేదా శక్తిమంతులైనప్పటికీ, తప్పు చేసిన వారిని ఎవరినీ వదలకూడదు. బాధ్యత నుండి ఏ వ్యక్తికీ మినహాయింపు ఉండకూడదు. ఇది మా సాధువులందరి అభిప్రాయం,” అని ఆయన ప్రకటించారు.