పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాల లక్ష్యంగా వైమానిక దాడులు నిర్వహించినట్లు అప్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్సుల్లో ఉన్న మిలిటెంట్ స్థావరాలపై గురువారం రాత్రి వైమానిక దాడులు నిర్వహించినట్లు తాలిబన్ రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది.
ఈ దాడులను ఎలా చేపట్టారనే విషయంపై తాలిబిన్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. గత కొన్ని నెలల తర్వాత అప్ఘనిస్థాన్ చేపట్టిన తొలి పెద్ద సైనిక చర్యగా దీన్ని భావిస్తున్నారు. “అప్ఘనిస్థాన్‌పై దాడులు చేయడానికి, కుట్రలు పన్నడానికి ఉపయోగిస్తున్న స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నాం. ఈ స్థావరాలన్నీ పాక్ గూఢచార సంస్థల సహకారంతో ఉపయోగిస్తున్న స్థావరాలే” అని తాలిబన్ రక్షణ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.
ఈ స్థావరాల నుంచే గతంలో అప్ఘనిస్థాన్‌పై ఘోర దాడులకు ప్రణాళికలు రూపొందించారని తాలిబన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ దాడుల్లో ఎంత మంది మరణించారు, గాయపడిన వారి సంఖ్య ఎంత ఉండొచ్చు అనే వివరాలను వెల్లడించలేదు. ఈ భారీ దాడులపై పాకిస్థాన్ సైన్యం కానీ, సమాచార మంత్రిత్వ శాఖలు కానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.
గత వారం అప్ఘనిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపింది. ఆ దాడుల్లో 13 మంది అప్ఘనిస్థాన్ పౌరులు మరణించగా, అందులో 11 మంది చిన్నారులే. మరో 14 మంది గాయపడ్డారని అప్పట్లో తాలిబన్ ప్రభుత్వం తెలిపింది. ఆ దాడికి కౌంటర్‌గానే అప్ఘన్ ఇప్పుడు పాక్‌పై దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
అప్ఘనిస్థాన్ భద్రతకు ముప్పుగా మారే ఏ చర్యనైనా ఇకపై సహించే ప్రసక్తే లేదంటూ తాలిబన్ రక్షణ శాఖ కఠిన హెచ్చరికలు జారీ చేసింది. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించి తమకు ముప్పుగా ఉన్నవాటిని ముందుగానే మట్టుబెట్టేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది.

More Stories
పాకిస్థాన్ ఒక ఫ్రాంకెన్‌స్టీన్ రాజ్యం
నిస్సహాయ స్థితిలో శాంతి ఒప్పందంపై ట్రంప్ సంతకం
అంతరిక్షం, అణుశక్తి, ఏఐలో భారత్ దూసుకుపోతోంది