నిస్సహాయ స్థితిలో శాంతి ఒప్పందంపై ట్రంప్ సంతకం 

నిస్సహాయ స్థితిలో శాంతి ఒప్పందంపై ట్రంప్ సంతకం 
* ఇరాన్ నౌకలపై అమెరికా ఆంక్షలు ఎత్తివేత 
 
సంఘర్షణను ముగించడానికి అమెరికా, ఇరాన్ దేశాలు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన మరుసటి రోజే, ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ ఒప్పందం కోసం ట్రంప్ ‘తీవ్రంగా ఆరాటపడుతున్నారని’, దానిని సాధించడానికి ‘అన్ని రకాల ఒత్తిళ్లను’ ఉపయోగించారని ఆయన ఆరోపించారు. 
 
ముసాయిదా ఒప్పందంపై సంతకాలు జరిగిన తర్వాత బహిరంగంగా మాట్లాడిన మొజ్తబా మాట్లాడుతూ, తాను మొదట ఈ ఒప్పందాన్ని ‘సూత్రప్రాయంగా’ వ్యతిరేకించినప్పటికీ, దేశ ప్రయోజనాలు,  ‘ప్రతిఘటన కూటమి’ ప్రయోజనాలు పరిరక్షించబడతాయని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ఇరాన్ సర్వోన్నత జాతీయ భద్రతా మండలి సభ్యుల నుండి హామీలు పొందిన తర్వాత చివరకు దానిని ఆమోదించినట్లు తెలిపారు.
 
“బాధ్యతాయుతమైన ఆందోళన, సద్భావనతో, బాధ్యతగల అధికారులు విస్తృతమైన ప్రయత్నాలు చేశారు. వాస్తవానికి, తీవ్ర ఆరాటంతో దీనిని సాధించడానికి అన్ని రకాల ఒత్తిళ్లను ఉపయోగించింది అమెరికా అధ్యక్షుడే. ఈ ఒప్పందం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరాశతో అన్ని రకాల మార్గాలను ఉపయోగించారు. ఇరాన్ మాత్రం తన ప్రయోజనాలను కాపాడుకుంటూ ముందుకు వెళ్లింది” అంటూ పేర్కొన్నారు.
కాగా, యుద్ధాన్ని ముగించే ఒప్పందంలో భాగంగా, అమెరికా నౌకాదళం డజనుకు పైగా నౌకలను ఇరాన్ ఓడరేవుల్లోకి అనుమతించిందని, తద్వారా దిగ్బంధనాన్ని సమర్థవంతంగా ఎత్తివేసిందని జేడీ వాన్స్ గురువారం తెలిపారు. 
 
వైట్ హౌస్ విలేకరుల సమావేశంలో వాన్స్ మాట్లాడుతూ, హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా పునఃప్రారంభమైందని, కేవలం బుధవారం రాత్రి ఒక్కరోజే ఈ వ్యూహాత్మక జలమార్గం గుండా 12.5 మిలియన్ బ్యారెళ్లకు పైగా రవాణా జరిగిందని తెలిపారు. ఈ ఒప్పందం ఇరాన్‌కు అసమానంగా అనుకూలంగా ఉందన్న విమర్శలను తోసిపుచ్చుతూ, “కాబట్టి మేము ఒప్పందంలోని తొలి భాగంలో సైనిక పరంగా మా వంతు బాధ్యతను కూడా నెరవేరుస్తున్నాము,” అని వాన్స్ పెక్రోన్నారు. 
 
అసాధారణంగా సూటిగా మాట్లాడుతూ, ఇజ్రాయెల్‌కు మిగిలి ఉన్న ‘ఏకైక శక్తివంతమైన మిత్రదేశంపై దాడి చేయవద్దని’ ఆయన ఆ దేశంలోని విమర్శకులను హెచ్చరించారు. మరోవంక,  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్ ఓడరేవుల వద్ద విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. 
 
ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఇరాన్ షరతులకు అంగీకరించడంతో ఎత్తివేసినట్లు ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఒప్పందం అమలును పర్యవేక్షించడానికి అమెరికా యుద్ధనౌకలు ఆ ప్రాంతంలో ఉంటాయని ఇరాన్ నౌకలకు ఎలాంటి ఆటంకం కలిగించవని సెంటకామ్‌ పేర్కొంది.