సాంకేతికత ద్వారా గ్రామీణ కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం, ఆర్థిక భద్రత అందిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ, స్టార్టప్ ఈవెంట్ అయిన వివాటెక్ 2026లో సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానవ-కేంద్రీకృత కృత్రిమ మేధపై న్యూఢిల్లీ దార్శనికతను వివరించడంతో పాటు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో విస్తరిస్తున్న భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించారు.
ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభించిన స్వామిత్వ కార్యక్రమంలో డ్రోన్లు, భౌగోళిక మ్యాపింగ్, ఆధునిక సర్వే సాంకేతికతను వినియోగించి గ్రామీణ కుటుంబాలకు ఆస్తి హక్కుల పత్రాలు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు రెండు లక్షల గ్రామాల్లో 3.1 కోట్లకు పైగా ఆస్తి కార్డులు జారీ చేశామని, దీంతో కుటుంబాలు తమ ఆస్తులను ఆర్థిక వనరులుగా వినియోగించుకునే అవకాశం పొందుతున్నాయని చెప్పారు.
ప్రభుత్వం ప్రజా సేవలను విస్తృత స్థాయిలో అందిస్తుంటే, భారత స్టార్టప్‌లు ప్రతి రంగంలోనూ మానవ జీవితాలను మార్చుతున్నాయని మోదీ పేర్కొన్నారు. ‘సరలాబెన్’ అనే ఏఐ ఆధారిత అప్లికేషన్ లక్షలాది మంది మహిళా పాడి రైతులకు వారి మాతృభాషలో పశుసంరక్షణ, నిర్వహణపై నిపుణుల సలహాలు అందిస్తోందని వివరించారు. భారత మహిళలకు డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇచ్చి ఎరువుల పిచికారీ, పంటల పర్యవేక్షణలో భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు.
ఉపగ్రహ సమాచారంతో లక్షలాది మంది మత్స్యకారులు అనుకూల చేపల వేట ప్రాంతాలను గుర్తించి ఇంధనం, సమయాన్ని ఆదా చేసుకుంటూ ఎక్కువ ఆదాయం పొందుతున్నారని చెప్పారు. ఈ సాంకేతిక పరిష్కారాలు గ్రామీణ స్థాయిలోనే అభివృద్ధి, సుసంపన్నతకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. అంతరిక్షం నుంచి అణుశక్తి వరకు మానవ సామర్థ్యాల హద్దులను భారత్ విస్తరిస్తోందని మోదీ అన్నారు.
చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతానికి సమీపంలో విజయవంతంగా ల్యాండ్ అయిన తొలి దేశంగా భారత్ నిలిచిందని గుర్తుచేశారు. ఇటీవల ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కీలక దశను చేరుకోవడం ద్వారా థోరియం ఆధారిత మూడు దశల అణుశక్తి లక్ష్య సాధనకు మరింత చేరువయ్యామని వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌లో రెండు లక్షలకుపైగా స్టార్టప్‌లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ప్రపంచంలోనే అత్యంత చురుకైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థల్లో భారత్ ఒకటిగా ఎదిగిందని మోదీ తెలిపారు.
ప్రపంచంలోనే తొలి సింగిల్ పీస్ 3డీ ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్, జన్యు చికిత్సలు, క్యాన్సర్‌ను గుర్తించే ఏఐ పరిష్కారాలు, సైబర్ భద్రతా సాంకేతికతలు, స్వయంచాలక రోబోలు, స్మార్ట్ సిటీలు, ఆధునిక రవాణా పరిష్కారాలను భారత్ ప్రదర్శిస్తోందని చెప్పారు. భారత స్టార్టప్‌ల ఆవిష్కరణలను ప్రత్యక్షంగా చూడాలంటే ఇండియా పెవిలియన్‌ను సందర్శించాలని ప్రపంచ పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

More Stories
జార్ఖండ్‌లో ఎన్డీఏ అభ్యర్థి నత్వానీ గెలుపుతో రాజ్యసభలో 2/3 ఆధిక్యత
అమెరికా ఒప్పందంలో ఇరాన్ కు రాయితీలు… ఇజ్రాయెల్ కు అవమానాలు!
నావికాదళంలో తొలిసారి ఇద్దరు మహిళలకు ‘శౌర్య చక్ర’ పురస్కారం!