ముడి చమురు ధరలు తగ్గినా ఇంధన ధరలను తగ్గించలేం 

ముడి చమురు ధరలు తగ్గినా ఇంధన ధరలను తగ్గించలేం 
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినంత మాత్రాన ఇదివరకు పెంచిన ధరలను వెంటనే తగ్గించలేమని పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేశ్‌ గోపీ స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధి తెరుచుకున్నప్పటికీ ప్రస్తుతం అక్కడ నౌకల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉంటుందని, తక్కువధరకు లభించే ముడిచమురు భారత్‌కు వచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని తెలిపారు. 

పలు అంశాల వల్ల ఇంధన ధరలను వెంటనే తగ్గించలేమని సురేశ్‌ గోపి తేల్చిచెప్పారు. ఇటీవల ఇంధన ధరల్లో నమోదైన పెరుగుదలపై స్పందించిన సురేశ్ గోపి, లీటర్​కు సుమారు రూ.3.94 మేర పెరుగుదల ప్రభావం మాత్రమే వినియోగదారలపై పడిందని తెలిపారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గాయని చెప్పి వెంటనే ఆ పెరుగదలను వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని పేర్కొన్నారు.  అమెరికా- ఇరాన్ శాంతి ఒప్పందం కుదిరి, యుద్ధం ముగియడంతో ముడి చమురు ధరలు ఇప్పటికే 30 వరకు తగ్గడంతో ఇటీవల పెంచిన ఇంధన ధరలను తగ్గించాలని వస్తున్న డిమాండ్లపై మంత్రి స్పందించారు. 

చౌకైన ముడి చమురును భారత్​కు తీసుకురావడనాకి హర్మూజ్ జలసంధి గుండా రవాణా చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతం ఆ మార్గంలో నౌకల రాకపోకలు అధికంగా ఉండటంతో పరిస్థితలు సాధారణ స్థితికి చేరేందుకు కొంత సమయం పడుతుందని ఆయన వివరించారు. పశ్చిమాసియాలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా చమురు కంపెనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని సురేష్ గోపీ తెలిపారు. 

పెరిగిన వ్యయభారాన్ని కొంత మేర కేంద్ర ప్రభుత్వం భరించిందని చెప్పారు. ఈ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వానికి సుమారు రూ.12 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అధిక ఇంధన ధరల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని తగ్గించుకునేలా పన్నుల్లో తగ్గింపు చేయలేదని, అయితే కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థలు వ్యవస్థను కొనసాగించాల్సిన బాధ్యతను నిర్వర్తించాయని ఆయన వివరించారు.