ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తూ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీద, కేంద్ర ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మండిపడ్డారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరుతూ నిన్న కిషన్ రెడ్డి గారికి సీఎం లేఖ రాయడం అత్యంత హాస్యాస్పదమని ధ్వజమెత్తారు.
రెండున్నరేళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి 71 సార్లు వెళ్లారని, కనీసం 15 సార్లు కేంద్రమంత్రులను కలిశారని గుర్తుచేశారు. అర్బన్ డెవలప్మెంట్, మెట్రో అంశాలపై కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ 5 సార్లు, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ని 3 సార్లు కలవడమే కాకుండా, హైదరాబాద్‌లో కూడా పలుమార్లు సమావేశమైన రేవంత్ రెడ్డి ఆ సందర్భాల్లో ఎప్పుడైనా కిషన్ రెడ్డికి చెప్పి కలిశారా? అని ప్రశ్నించారు.
ప్రధానమంత్రిని పలుమార్లు కలిసిన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులను కలవడానికి అడ్డంకులు ఉన్నాయని చెప్పడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పుడు మాత్రం అపాయింట్మెంట్ ఇప్పించడం లేదంటూ కిషన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం రాజకీయ నాటకం, బూటకమేనని మండిపడ్డారు. కేవలం ప్రజలను తప్పుదారి పట్టించేందుకే రేవంత్ రెడ్డి లేఖ రాశారని దుయ్యబట్టారు.
తన వైఫల్యాలన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిపై ఆసక్తి లేదని, ఆ పార్టీకి కేవలం స్కాములు, కమీషన్ల రాజకీయాలపైనే అనుభవం ఉందని రాంచందర్ రావు ఎద్దేవా చేశారు. 2జి స్కామ్, అగస్టా వెస్ట్‌ల్యాండ్ స్కామ్ లు కాంగ్రెస్ చరిత్ర అని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టులను ఎలా ప్రతిపాదించాలో కూడా తెలియదని, మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్టు, ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ రిపోర్టు, డీపీఆర్ లను ఇప్పటి వరకు సమర్పించలేదని విమర్శించారు. అవసరమైన సాంకేతిక పత్రాలు ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుంటోందని చెప్పడం ముమ్మాటికీ అవాస్తవమని తెలిపారు.
కేంద్రం మెట్రో ఫేజ్-2కు వ్యతిరేకం కాదని, ఎప్పుడూ ప్రాజెక్టును తిరస్కరించలేదని స్పష్టం చేశారు.ఇది కేంద్రం చేసిన ‘రిజెక్షన్’ కాదు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన ‘డిలే’ (ఆలస్యం) మాత్రమేనని తేల్చిచెప్పారు. రుణాల చెల్లింపుల కంటే ముందు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంశంపై, ప్రాజెక్టు నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని కేంద్రం సూచించిన సలహాలు పాటించకుండా, ఇప్పుడు కేంద్రంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.
కాగా, బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన సీనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి, సినీ నిర్మాత బండి శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీలో చేరడం పట్ల రాంచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు

More Stories
మెట్రో ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు
ఎసిబి సోదాల్లో సర్వే డిప్యూటీ డైరెక్టర్‌కు రూ.200 కోట్ల ఆస్తుల
ఎంఐఎం, లవ్ జిహాద్, అఘాయిత్యాలపై ఎందుకీ చోద్యం?