ఎసిబి సోదాల్లో సర్వే డిప్యూటీ డైరెక్టర్‌కు రూ.200 కోట్ల ఆస్తుల

ఎసిబి సోదాల్లో సర్వే డిప్యూటీ డైరెక్టర్‌కు రూ.200 కోట్ల ఆస్తుల
హైదరాబాద్‌ పాతబస్తీలో నివసిస్తున్న ల్యాండ్స్‌ అండ్‌ సర్వే డిప్యూటీ డైరెక్టర్‌ సుంకరి నరహరి వందల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులతో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సుంకరి నరహరిపై వచ్చిన ఆరోపణలతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులకు భారీ మొత్తంలో నగలు, నగదు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించాయి. 
 
హైదరాబాద్ ఛత్రినాకలోని సుంకరి నరహరి ఇంటితోపాటు ఆయన కార్యాలయం, కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లు ఇలా మొత్తం 11 ప్రాంతాల్లో ఒకే సమయంలో దాడులు చేశారు. ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలు బయటపడ్డాయని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. బీరువాలు, లాకర్లలో ఎక్కడ వెతికినా బంగారం కుప్పలు కుప్పలుగా దొరికిందని అంటున్నారు. ఇంకా సుమారు 8 కిలోల వరకు వెండి, ఇతర నగలు, వజ్రాల హారాలు.. భారీగా దొరుకడంతో నరహరిని తక్షణమే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
 
ఈ క్రమంలోనే సుంకరి నరహరి ఇంట్లో ఆయన బెడ్రూంలో ఉన్న బెడ్డు కింద రూ.1.10 కోట్ల నగదు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సుంకరి నరహరితోపాటు ఆయన సోదరుడి ఇంట్లో భారీగా ఆస్తిపత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాంతాల్లో ఓపెన్‌ ప్లాట్లతోపాటు రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు విచారణలో వెల్లడైంది.
ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ నేతృత్వంలోని స్పెషల్ టీమ్స్ ఈ సోదాలు చేపట్టాయి.  నరహరి ఆస్తుల మార్కెట్ విలువ  రూ.200 కోట్లకు పైనే ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నరహరిరావు భార్య పేరిట రెండు బ్యాంకు లాకర్లు ఉన్నట్టు ఏసీబీ దర్యాప్తులో తేలింది. వీటిని త్వరలోనే తెరిచి మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నామని అధికారులు చెప్పారు. ఇవి కూడా తెరిస్తే అక్రమాస్తుల విలువ మరికొన్ని కోట్లకు పైగా తేలే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రస్తుతం అదనపు ఆస్తులకు సంబంధించిన వెరిఫికేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. పకా ఆధారాలతో పట్టుబడిన నరహరిరావును ఏసీబీ అధికారులు హైదరాబాద్‌ నాంపల్లిలోని ప్రిన్సిపల్‌ ప్రత్యేక న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్‌ విధించింది.  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రోడ్లు, భవనాల (ఆర్&బి) ఇంజనీర్-ఇన్-చీఫ్ మోహన్ నాయక్‌ను ఏసీబీ అరెస్టు చేసిన వారం రోజుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఏసీబీ ప్రకారం, సోదాల్లో గుర్తించిన ఆస్తుల అధికారిక విలువ సుమారు రూ. 17.95 కోట్లు. అయితే, వాటి మార్కెట్ విలువ దాదాపు రూ. 200 కోట్లుగా అంచనా వేశారు.