* సమగ్ర భాగస్వామ్యం స్థాయికి భారత్, స్లొవేకియా సంబంధాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం బ్రాటిస్లావా పర్యటన సందర్భంగా స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ (1వ తరగతి)’ను అందుకున్నారు. ఒక విదేశీ దేశం ఆయనకు ప్రదానం చేసిన 33వ అంతర్జాతీయ పురస్కారం ఇది. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, భారతదేశ ప్రపంచ భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ప్రధాని మోదీ చేసిన కృషికి గుర్తింపుగా స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందజేశారు.
1993లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్లోవేకియాలో పర్యటించిన తొలి భారత ప్రధానమంత్రిగా నిలిచిన ప్రధాని మోదీ చారిత్రాత్మక పర్యటన సందర్భంగా ఈ పురస్కారం లభించింది. ‘ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ (1వ తరగతి)’ అనేది స్లోవేకియా గణతంత్ర రాజ్యపు అత్యున్నత జాతీయ పురస్కారం. స్లోవేకియాతో స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడంలో, దాని విదేశాంగ విధాన ప్రయోజనాలను మరియు అంతర్జాతీయ ప్రతిష్టను ముందుకు తీసుకెళ్లడంలో విశేష కృషి చేసిన విదేశీ ప్రముఖులకు స్లోవేకియా అధ్యక్షుడు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
ఈ పురస్కారాన్ని అందుకున్న అనంతరం కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రధాని మోదీ దీనిని భారత ప్రజలకు, ఇరు దేశాల మధ్య శాశ్వత భాగస్వామ్యానికి అంకితం చేశారు. ఎక్స్ లో ఒక పోస్ట్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు: “ఈ సాయంత్రం బ్రాటిస్లావాలో ‘ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ (1వ తరగతి)’ పురస్కారాన్ని అందుకోవడం గౌరవంగా ఉంది. భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు చెందిన ఈ గౌరవాన్ని అందించినందుకు స్లోవేకియా ప్రజలకు, ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. ఈ పురస్కారాన్ని భారతదేశం, స్లోవేకియా మధ్య ఉన్న శాశ్వత స్నేహానికి అంకితం చేస్తున్నాను.”
సమగ్ర భాగస్వామ్యం స్థాయికి భారత్, స్లొవేకియా సంబంధాలను పెంపొందించాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. సోమవారం స్లొవేకియా చేరుకున్న మోదీ ఈ దేశాన్ని సందర్శించిన తొలి భారతీయ ప్రధాని. ఈ సందర్భంగా రాజధాని బ్రటిస్లావాలో స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోతో మోదీ భేటీ అయ్యారు. అవగాహనా పత్రాలను పరస్పరం మార్చుకొని, సంయుక్త పత్రికా ప్రకటనలు విడుదల చేశారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, భారత్-ఇయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టిఎ) ఖరారు చేయడంలో స్లొవేకియా అందించిన సహకారానికి ప్రధాని ఫికోకు మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశార. ఈ ఒప్పందాన్ని త్వరగా అమలు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఇరు దేశాల మధ్య సమగ్ర భాగస్వామ్యం ఉమ్మడి విశ్వాసాలు, ఉమ్మడి ప్రాధాన్యతలు, ఉమ్మడి భవితవ్యానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు.
ఇరు దేశాల మధ్య రక్షణ సహకారమనేది పరస్పరం నెలకొన్న విశ్వాసం, వ్యూహాత్మక సమన్వయానికి సాక్ష్యమని ప్రధాని పేర్కొన్నారు. రక్షణ సహకారంపై ఈ రోజు ఖరారైన ఒప్పందంతో ఇరు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య సహకారాన్ని వేగవంతం చేయడానికి కొత్త ఊపునిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్లొవేకియా ప్రధాని ఫికో మాట్లాడుతూ, భారతదేశం సాధిస్తున్న సత్వర ఆర్థిక పురోభివృద్ధిని, డిజిటల్ పరివర్తనను, కృత్రిమ మేథలో ముందంజను ప్రశంసించారు. కీలకమైన రంగాల్లో అనేక అభివృద్ధి చెందిన దేశాలను భారత్ అధిగమించిందని వ్యాఖ్యానించారు. ఇరు దేశాలు అనేక ఉమ్మడి ప్రయోజనాలను కలిగి వున్నాయని తెలిపారు. పలు రంగాల్లో భారత్ సాధించిన విజయాలను ప్రశంసించారు.
యురోపియన్ యూనియన్ అనేక ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటోందని, భారత్ సాధించిన పురోభివృద్ధి నుండి అనేక విలువైన పాఠాలను నేర్చుకోవాలని సూచించారు. అంతకుముందు మోదీ అధికార స్వాగత సత్కారాల కార్యక్రమంలో భాగంగా స్లొవేకియా సైనిక వందనాన్ని స్వీకరించారు. మూడు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఆటోమొబైల్ తయారీ, రైల్వేల అభివృద్ధి, ఇతర వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై ఇరు దేశాల నేతలు, ప్రతినిధి బృందాలు దృష్టి కేంద్రీకరించనున్నారు.

More Stories
హిందూ ధర్మం కూడా నమోదు కాలేదు
‘టైమ్స్’ అత్యంత ప్రభావశీలుర జాబితాలో మంధాన!
ఒకేసారి వార్తల్లో రెబెల్ టిఎంసి ఎంపీలు విలీనమైన ఎన్సీపీఐ!