* రెబెల్ టిఎంసి ఎంపీలు సోమవారం స్పీకర్ ఓం బీర్లతో భేటీ?
పశ్చిమబెంగాల్ లో అధికార పీఠాన్ని కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)లో అంతర్గత సంక్షోభం తీవ్రతరమవుతోంది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు, సీనియర్ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, భూపేందర్ యాదవ్‌లతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ సమావేశంలలో తిరుగుబాటు ఎంపీ శతాబ్ది రాయ్ సైతం పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.
శనివారం నాడు, అసమ్మతి ఎంపీ శతాబ్ది రాయ్‌తో కలిసి సుదీప్ బందోపాధ్యాయ ఢిల్లీలోని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు. 19 మంది లోక్‌సభ ఎంపీల మద్దతు ఉందని చెప్పుకుంటున్న ఈ అసమ్మతి వర్గం, తమను ఒక ప్రత్యేక వర్గంగా గుర్తించాలని, సభలో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ఎంపీల పక్కన కూర్చోవడానికి అనుమతించాలని కోరుతూ సోమవారం స్పీకర్ ఓం బిర్లాను కలవడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
అసమ్మతి టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ, ఇతర సీనియర్ బీజేపీ నాయకులను కలిసిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, రాష్ట్ర, కేంద్ర స్థాయిలలోని పార్టీ ప్రజాప్రతినిధులలోని ఒక పెద్ద వర్గం తిరుగుబాటు చేయడంతో టీఎంసీలో కలకలం రేగింది. లోక్‌సభలో 28 మంది, రాజ్యసభలో 13 మంది సభ్యులు ఉన్న ఈ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు.
అసమ్మతి వర్గం స్పీకర్‌కు ఒక వినతిపత్రాన్ని సమర్పించిందని, సోమవారం నాడు తమ వాదనను అధికారికంగా వినిపిస్తామని అసమ్మతి ఎంపీ జగదీష్ చంద్ర బర్మా బసునియా తెలిపారు. “మేము లేఖను సమర్పించాము… సోమవారం నాడు మేము స్పీకర్‌ను కలిసి, అసలైన టీఎంసీ పార్లమెంటరీ గ్రూప్‌ను ఏర్పాటు చేసేందుకు మా హక్కును కోరతాము. మా వాదనకు గుర్తింపు ఇవ్వాలని మేము స్పీకర్‌ను కోరతాము,” అని బసునియా తెలిపారు.
సోమవారం నాటి సమావేశానికి ముందు 20 మంది అసమ్మతి ఎంపీలు ఢిల్లీకి చేరుకుంటారని అంచనా. సంతకాల సేకరణ ప్రక్రియ జూన్ 8న ప్రారంభమైందని, 19 మంది ఎంపీలు ఆ వినతిపత్రంపై సంతకాలు చేశారని ఆయన చెప్పారు. సమావేశ సమయం ఇంకా ఖరారు కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం నాటి సమావేశానికి ముందు దాదాపు 20 మంది ఎంపీలు ఢిల్లీకి చేరుకుని, తమ భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరుపుతారని అసమ్మతి వర్గాల సమాచారం.
కాగా, అసమ్మతివాదుల వాదనకు ఎటువంటి చట్టపరమైన ప్రాతిపదిక లేదని పార్టీ పేర్కొంది. రాజ్యాంగంలోని 91వ సవరణ పార్టీ చీలికకు సంబంధించిన నిబంధనలను తొలగించిందని, ఒక పార్టీని విడిచిపెట్టాలనుకునే ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా మరొక రాజకీయ పార్టీలో విలీనం కావాల్సి ఉంటుందని పార్టీ ఎంపీ మహువా మొయిత్రా స్పష్టం చేశారు.
“ద్రోహులైన టీఎంసీ ప్రజాప్రతినిధులకు చట్టంపై అవగాహన లేదు. 2003 నాటి రాజ్యాంగ 91వ సవరణ ద్వారా ‘విడి వర్గం’ ఏర్పాటుకు సంబంధించిన నిబంధనను తొలగించారు. ఎంపీల సంఖ్యతో సంబంధం లేదు. అసలు రాజకీయ పార్టీలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు మరో పార్టీలో విలీనం కావాల్సి ఉంటుంది. ఆ 19 మంది ద్రోహులు తమ పదవులకు రాజీనామా చేసి, బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేయాలి,” అని ఆమె ‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్ట్‌లో చెప్పారు.
పార్టీలోని అంతర్గత కలహాల మధ్య, 19 మంది టీఎంసీ లోక్‌సభ ఎంపీల పేర్లు, సంతకాలతో కూడినదిగా చెబుతున్న ఒక జాబితా ఆన్‌లైన్‌లో ప్రచారమైంది. అయితే, స్పీకర్ బిర్లాకు రాసినట్లుగా చెబుతున్న లేఖ మాత్రం బహిరంగంగా లభించలేదు.
అసమ్మతి వర్గానికి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, కాకోలీ ఘోష్ దస్తిదార్ నేతృత్వంలో ఒక ప్రత్యేక పార్లమెంటరీ కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు తెలియజేశారు. అలాగే, తమకంటూ ఒక ప్రత్యేక రాజకీయ గుర్తింపును నిలుపుకుంటూనే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలనే తమ నిర్ణయాన్ని కూడా వారికి తెలియజేశారు.

More Stories
ఆధునిక ప్రపంచ సవాళ్లకు భారత్ లో శాశ్వత పరిష్కారాలు
పరిశోధన, ఆవిష్కరణలు భారత నాగరికతలో అంతర్భాగం
సరిహద్దు జిల్లాల్లో జనాభా మార్పులపై సమగ్ర అధ్యయనం