పంజాబ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఎలాంటి పొత్తులు లేకుండా, రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో సొంతంగా పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఈసారి అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ వ్యూహాలు రచిస్తోంది.
శనివారం ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన జరిగిన పంజాబ్ బిజెపి కీలక నేతల సమావేశంలో మొత్తం 117 స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధం కావాలని ఆ ఇద్దరు నాయకులు రాష్ట్ర స్థాయి నాయకత్వానికి సూచించారు. పంజాబ్ రాజకీయ పరిస్థితులు, రానున్న అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సమావేశానికి పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు కేవల్ సింగ్ ధిల్లాన్‌తో పాటు సునీల్ జాఖర్, కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు, రాణా గుర్మీత్ సింగ్ సోధీ, మన్‌ప్రీత్ సింగ్ బాదల్, తరుణ్ చుగ్, అశ్వనీ శర్మ, ఇక్బాల్ సింగ్ లాల్‌పురా, పరమిందర్ సింగ్ బ్రార్, ఫతేజంగ్ సింగ్ బజ్వా తదితరులు హాజరయ్యారు.
“పంజాబ్‌ను దాని విధికి వదిలేయలేం. దానిని కాపాడి, పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావాలి,” అని బీజేపీ ప్రధాన కార్యాలయంలో రెండు గంటల పాటు (రాత్రి 8.30 నుండి 10.30 వరకు) జరిగిన సమావేశంలో అమిత్ షా వ్యాఖ్యానించినట్లు సమాచారం. అప్పుల గణాంకాలు సూచిస్తున్న ఆర్థిక సంక్షోభం, మాదకద్రవ్యాల సమస్య, శాంతిభద్రతలు, మత మార్పిడులు, నేల సారం క్షీణత వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చాయి.
పంజాబ్‌ను ప్రస్తుత “ఆర్థిక సంక్షోభం” నుండి కాపాడటం అత్యవసరమని నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రజల్లో బీజేపీ విధానాలు, అజెండాపై నమ్మకాన్ని కలిగించడం ఒక ప్రధాన సవాలుగా నిలిచింది. “ప్రజల హృదయాలను గెలుచుకునేలా” కృషి చేయాలని అమిత్ షా, నబిన్ పార్టీ నేతలకు సూచించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, ప్రస్తుతం బెంగాల్ వంటి తాము పాలించిన ప్రతి రాష్ట్రంలోనూ ఆర్థిక వ్యవస్థ, శాంతిభద్రతల సవాళ్లను బీజేపీ ఏ విధంగా పరిష్కరించిందో షా ఉదాహరణగా పేర్కొన్నారు.
“పంజాబ్‌లో ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ (కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం) అవసరం మరెక్కడా లేనంతగా ఉంది,” అని సమావేశంలో పాల్గొన్న వర్గాలు తెలిపాయి. కాగా, బీజేపీ ఈ రాష్ట్రంలో తన జాతీయ స్థాయి ప్రజా సంపర్క కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించింది.
సమావేశం అనంతరం మాట్లాడిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ రాబోయే ఎన్నికల్లో ప్రజల ముందుకు ఎలాంటి అంశాలతో వెళ్లాలన్న దానిపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. పంజాబ్ యువతను నాశనం చేస్తున్న మాదకద్రవ్యాల వ్యాపారాన్ని మూలాలతో సహా నిర్మూలించడం తమ తొలి ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతులు, వ్యాపారులు, ఉద్యోగుల హక్కులను కాపాడటం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా పనిచేస్తామని వెల్లడించారు. పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు కేవల్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, ప్రస్తుతం పొత్తుల అంశం చర్చలోనే లేదని స్పష్టం చేశారు. పంజాబ్ అభివృద్ధే తమ ఏకైక అజెండా అని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ నేత మన్‌ప్రీత్ సింగ్ బాదల్ మాట్లాడుతూ, పంజాబ్ ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రం కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. ఇక సునీల్ జాఖర్ మాట్లాడుతూ, ఆప్ ప్రభుత్వం కాంగ్రెస్‌తో కలిసి పంజాబ్‌ను దోచుకుంటోందని ఆరోపించారు.
రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ప్రజలకు ప్రత్యామ్నాయంగా బీజేపీని బలమైన శక్తిగా నిలబెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. బీజేపీ నేత పరమిందర్ సింగ్ బ్రార్ మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు సాధించిన అభివృద్ధి పనులను, పార్టీ విజన్‌ను పంజాబ్ ప్రజల ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. తమ పాలనలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి నమూనాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

More Stories
ఆధునిక ప్రపంచ సవాళ్లకు భారత్ లో శాశ్వత పరిష్కారాలు
టిఎంసి ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ అమిత్ షాతో భేటీ
పరిశోధన, ఆవిష్కరణలు భారత నాగరికతలో అంతర్భాగం