భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలు చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1695 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ కూడా అత్యధికంగా 461.30 పాయింట్లు పైకి ఎగసింది. ట్రేడింగ్ ఉదయం భారీ లాభాల్లో 74,709.27 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. దాదాపు అన్ని రంగాల షేర్లు దుమ్మురేపాయి. ముఖ్యంగా నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు ఏకంగా 3 శాతానికి పైగా లాభపడి మార్కెట్‌ను నడిపించాయి.
ఒక దశలో సెన్సెక్స్ 75,608.02 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరకు 1695.40 పాయింట్ల లాభంతో 75,527.95 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా రోజంతా లాభాల్లోనే కొనసాగింది. చివరకు 461.30 పాయింట్ల లాభంతో 23,622.90 పాయింట్ల వద్ద ముగిసింది. ఇరాన్‌తో ఒక చారిత్రాత్మకమైన ఒప్పందం కుదిరిందని, కేవలం దానికి సంబంధించిన అధికారిక పత్రాల ఖరారు మాత్రమే మిగిలి ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్ల రూపురేఖలను మార్చేశాయి.
ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గితే, అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలు మెరుగుపడి ముడిచమురు ధరలు స్థిరపడతాయనే నమ్మకంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు మార్కెట్లలో పెట్టుబడుల వర్షం కురిపించారు. భారీ లాభాల కారణంగా స్టాక్ మార్కెట్ ఈ ఒక్కరోజే ఏకంగా రూ.9.7 లక్షల కోట్లు అర్జించింది. దీంతో భారత స్టాక్ మార్కెట్ విలువ రూ.452.33 లక్షల కోట్ల నుంచి రూ.462.05 లక్షల కోట్లకు పెరిగింది.
సెన్సెక్స్ 20 సూచీలో బజాజ్ ఫైనాన్స్, ఎటర్నల్, ఇండిగో, ఎల్‌అండ్‌టీ, టైటాన్ షేర్లు లాభపడగా, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గాయి. శుక్రవారం బ్రెంట్ బ్యారెల్ క్రూడాయిల్ ధర 86 డాలర్లుగా ఉంది. బంగారం ఔన్స్ ధర కూడా తగ్గి, 4224 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌‌తో రూపాయి మారకం విలువ 95.11గా ఉంది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉండటం, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం మార్కెట్‌కు కలిసొచ్చింది.