పాక్ ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ వాదనను తిప్పికొట్టిన భారత్

పాక్ ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ వాదనను తిప్పికొట్టిన భారత్

తన సొంత భూభాగంలోని సమూహాల కోసం ఇస్లామాబాద్ ఇటీవల ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ అనే పదాన్ని ఉపయోగించడాన్ని భారత్ తిరస్కరించింది. ఈ చర్యను మతపరమైన భాషలో ప్రదర్శించిన, ప్రభుత్వ మద్దతుగల తప్పుడు సమాచారంగా  ఐక్యరాజ్యసమితిలో భారత్ అభివర్ణించింది.  ఆఫ్ఘనిస్తాన్‌లోని పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం సందర్భంగా భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతేని ఈ వ్యాఖ్యలు చేశారు.

కొన్ని సమూహాలను ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’గా ముద్ర వేయాలన్న పాకిస్థాన్ అధికారిక ఆదేశాలు తప్పుదోవ పట్టించేవిగా, తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడానికి ఉద్దేశించినవిగా ఉన్నాయని ఆయన విమర్శించారు.  “ఒక మారణకాండను సైనిక చర్యగా చిత్రీకరించడం వల్ల నేరస్థుడికి విముక్తి లభించదు. పౌరులను చంపడం, గాయపరచడం, అనాథలను చేయడం ఉగ్రవాద నిరోధం కాదు,” అని పర్వతేని స్పష్టం చేశారు.   

అంతర్గత రాజకీయ, ఆర్థిక సమస్యల నుండి దృష్టి మరల్చడానికి ఉద్దేశించిన విస్తృత ప్రచార వ్యవస్థను ఈ కథనం ప్రతిబింబిస్తోందని ఆయన తెలిపారు.  ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్ సైనిక వైమానిక దాడుల వల్ల పౌరులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెబుతూ మానవతా విలువలకు మద్దతు ఇస్తున్నామని చెప్పుకుంటూనే, అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా ఇస్లామాబాద్ వ్యవహరిస్తోందని ఆరోపించారు.

అది ముమ్మాటికీ సామాన్య పౌరులపై జరిగిన ‘నరమేధమే’ అని భారత్ మండిపడింది. పవిత్ర రంజాన్ మాసంలో కూడా పాక్ జరిపిన దాడుల్లో మహిళలు, చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా ఖండించారు. “ఒక ఘోర నరమేధానికి మిలిటరీ ఆపరేషన్ అని పేరు పెట్టినంత మాత్రాన చేసిన పాపం కొట్టుకుపోదు” అని పర్వతనేని పాకిస్థాన్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పౌరులను చంపడం, పిల్లలను అనాథలను చేయడం ఎప్పటికీ ఉగ్రవాద నిర్ములన కాబోదని స్పష్టం చేశారు.

ఐరాస నివేదికల ప్రకారం 2026 మొదటి మూడు నెలల్లోనే పాక్ దాడుల వల్ల 372 మంది అమాయక పౌరులు మరణించగా, 397 మంది గాయపడ్డారు. ఈ దారుణాలపై స్వతంత్ర దర్యాప్తు జరిపి నిందితులను శిక్షించాలని భారత్ డిమాండ్ చేసింది. దీనికితోడు అఫ్గానిస్థాన్ వాణిజ్యాన్ని దెబ్బతీసేలా పాక్ ల్యాండ్ రూట్‌ను నిలిపివేయడాన్ని భారత్ “ట్రేడ్ అండ్ ట్రాన్సిట్ టెర్రరిజం”గా పేర్కొంది.

దీనికి విరుగుడుగా ఆఫ్ఘన్ వసతువులకు భారత్ సుంకాలు లేని మార్కెట్ సదుపాయాన్ని, ప్రత్యేక ఎయిర్ కార్గో కారిడార్‌ను అందుబాటులోకి తెచ్చిందని, ప్రస్తుతం అఫ్గానిస్థాన్ మొత్తం ఎగుమతుల్లో 43 శాతం భారత్‌కే జరుగుతున్నాయని ప్రపంచ బ్యాంక్ నివేదికలను ఉటంకించారు.  ఇటీవలి రాజ్యాంగ మార్పులు, రక్షణ నాయకత్వ నియామకంతో సహా పాకిస్తాన్ అంతర్గత రాజకీయ పరిస్థితిని కూడా భారత్ ప్రస్తావించింది. అసిమ్ మునీర్‌తో సహా పాకిస్తాన్ సైనిక నాయకత్వం దేశ పాలనలో లోతైన నిర్మాణాత్మక సమస్యలను ప్రతిబింబిస్తోందని పార్వతనేని పేర్కొన్నారు.