20 మంది టీఎంసీ ఎంపీల తిరుగుబాటు.. ఎన్డీయేకు మద్దతు 

20 మంది టీఎంసీ ఎంపీల తిరుగుబాటు.. ఎన్డీయేకు మద్దతు 
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి అగ్రనేతలతో అత్యవసర సమావేశంలో పాల్గొన్న రోజే లోక్‌సభలో ఆమె సొంత పార్టీకి చెందిన ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. టీఎంసీ పార్టీకి ఉన్న 28 మంది ఎంపీల్లో దాదాపు 20 మంది అధికార ఎన్‌న్డీయే కూటమికి మద్దతు ఇవ్వాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలోని టీఎంసీ శాసనసభాపక్షంపై ఇప్పటికే పట్టు కోల్పోయిన పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ఇది భారీ ఎదురుదెబ్బ.

తృణమూల్ లోక్‌సభ చీఫ్ విప్ పదవి నుంచి తనను అకస్మాత్తుగా తొలగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకురాలు కకోలి ఘోష్ దస్తీదార్ ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ దేశ ప్రయోజనాల దృష్ట్యా తమ భవిష్యత్తు రాజకీయ ప్రయాణం ఎన్డీఏ కూటమితోనే సాగాలని తాము బలంగా నమ్ముతున్నట్లు దస్తీదార్ ప్రకటించారు. 

తమతోపాటు ఉన్న 20 మంది ఎంపీల సంతకాలతో కూడిన మద్దతు లేఖను లోక్‌సభ స్పీకర్‌కు త్వరలోనే అందజేస్తామని చెప్పారు.  టీఎంసీ ఎంపీల ఈ బృందం “ఎన్డీయేకు అధికారికంగా మద్దతు” ఇస్తుందని, పశ్చిమ బెంగాల్ అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు.  మరో రెబెల్ ఎంపీ షర్మిలా సర్కార్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ తాము పార్లమెంట్‌లో 20 మంది ఎంపీలతో ఒక ప్రత్యేక గ్రూప్‌గా ఏర్పడి ఎన్‌న్డీయేకు మద్దతు ఇస్తున్నామని స్పష్టంచేశారు.

ఈ కొత్త గ్రూప్‌నకు కకోలి ఘోష్ దస్తీదార్ చీఫ్ విప్‌గా, శతాబ్ది రాయ్ డిప్యూటీ లీడర్‌గా వ్యవహరిస్తారని చెప్పారు.  “మేము 20 మంది ఎంపీలం. సువేందు అధికారి సమక్షంలో భూపేందర్ యాదవ్ నివాసంలో సమావేశమయ్యాం. బెంగాల్ అభివృద్ధి కోసం మనం ఎన్డీయేకు మద్దతు ఇవ్వాలి. కాకోలి దీదీ ఆ లేఖను సమర్పించారు. ప్రస్తుతం ఆమె మా బృందానికి నాయకత్వం వహిస్తున్నారు” అని చెప్పారు. 

మహారాష్ట్రలో శివసేన పార్టీ చీలిపోయిన తరహాలోనే ఇప్పుడు బెంగాల్‌లోనూ అదే దృశ్యం కనిపిస్తోంది. ఇప్పటికే బెంగాల్ అసెంబ్లీలోనూ 58 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి తామే ‘అసలైన తృణమూల్’ అని ప్రకటించుకుంటున్న తరుణంలో ఇప్పుడు లోక్‌సభలోనూ మెజారిటీ ఎంపీలు చేజారిపోవడం గమనార్హం.  ఈ రెబెల్ ఎంపీలంతా సోమవారం ఢిల్లీలోని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నివాసంలో ప్రత్యేకంగా సమావేశమై ఈ తిరుగుబాటు వ్యూహానికి తుది రూపాన్ని ఇచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువెందు అధికారి కూడా పాల్గొన్నారు.