సంక్షోభం వల్లే ఎల్‌పీజీ ధరల పెంపు అనివార్యం

సంక్షోభం వల్లే ఎల్‌పీజీ ధరల పెంపు అనివార్యం
ప్రపంచ సంక్షోభం కారణంగా ఎల్‌పీజీ ధరల పెంపు అనివార్యంగా మారిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గ్యాస్ సిలిండర్ ధరల పెంపు పట్ల కేంద్రం కూడా బాధపడుతోందని, అలాగే విచారం వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు. ఇంధన రవాణా సజావుగా సాగకపోవడం, చాలా పరిమిత వనరుల నుంచే ఎల్‌పీజీ లభించడం వంటి సమస్యలు ఉన్నాయని వెల్లడించారు. 
 
ప్రపంచవ్యాప్తంగా ఇంధన వ్యయాలు పెరిగి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో గృహ వినియోగ వంట గ్యాస్ (ఎల్‌పీజీ) ధర సిలిండర్‌కు రూ. 29 మేర పెంచింది కేంద్ర ప్రభుత్వం. గత మూడు నెలల్లో ఎల్‌పీజీ ధర పెరగడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చి 7న సిలిండర్‌పై రూ. 60 పెంచింది. మళ్లీ జూన్ 7న గ్యాస్ సిలిండర్ రేటును పెంచుతూ కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది.
 
తాజా రేటు పెంపునకు ముందు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు విక్రయించే ప్రతి ఎల్‌పీజీ సిలిండర్‌పై సుమారు రూ. 703 నష్టాన్ని చవిచూస్తున్నట్లు అంచనా. “గ్యాస్ సిలిండర్ ధరల పెంపు పట్ల మేము కూడా చాలా బాధపడుతున్నాం, విచారం వ్యక్తం చేస్తున్నాం. కానీ మమ్మల్ని విమర్శించే ముందు ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్త పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ప్రపంచం తీవ్రమైన సంక్షోభాల మధ్య సతమతమవుతోంది. రవాణా సజావుగా సాగకపోవడం, చాలా పరిమిత వనరుల నుంచే ఎల్‌పీజీ లభించడం వంటి సమస్యలు ఉన్నాయి” అని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. 
 
ఎల్‌పీజీ, పెట్రోల్/డీజిల్ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సేకరణ వనరులను పెంచడానికి ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. భారత్‌కు చాలా దూరంలో ఉన్న దేశాల నుంచి కూడా గ్యాస్, ఇంధన సేకరణ జరుగుతోందని చెబుతూ రవాణా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని, మూల ధర కూడా అధికంగా ఉందని చెప్పారు.  అలాగే 40-45 రోజుల రవాణా సమయం కారణంగా బీమా ఖర్చులు కూడా పెరిగాయని వివరించారు. కన్నడనాట రాజకీయాలను ప్రస్తావిస్తూఅధికార కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, బంధుప్రీతి, వర్గపోరుతో సతమతమవుతోందని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. అధికార పార్టీలో అంతర్గత అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒక మంత్రి రాజీనామా చేశారని, మరికొందరు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని గుర్తుచేశారు. డీకే సర్కార్ పాలన అంత సవ్యంగా లేదని ఈ పరిస్థితులే స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.