పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. తమ భూభాగంపై ఆదివారం రాత్రి ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు ఇజ్రాయెల్ గట్టిగా బదులిచ్చింది. ఇరాన్ లోపలికి దూసుకెళ్లిన ఇజ్రాయెల్ వైమానిక దళం (ఐఎఎఫ్) అక్కడ భారీ ఎత్తున వైమానిక దాడులు నిర్వహించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.
‘పశ్చిమ, మధ్య ఇరాన్‌లోని ఇరానియన్ ఉగ్రవాద పాలనకు చెందిన సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం కొద్దిసేపటి క్రితమే విజయవంతంగా దాడులు చేసింది’ అని ఐడిఎఫ్ తమ ఎక్స్ ఖాతాలో పేర్కొంది. ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడి, ఇరాన్‌పై ఎలాంటి ప్రతీకార దాడులు చేయవద్దని సూచించినట్లు అంతకుముందు వార్తలు వచ్చాయి.
అయితే, అమెరికా ఒత్తిడిని, హెచ్చరికలను పక్కనబెట్టి నెతన్యాహు ప్రభుత్వం ఇరాన్‌పై నేరుగా సైనిక చర్యకు దిగడం అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత అటు లండన్ కూడా ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరినప్పటికీ ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. తద్వారా తమ దేశ రక్షణ విషయంలో ఎవరి మాట వినే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ పరోక్షంగా తేల్చిచెప్పింది.
పశ్చిమ, మధ్య ఇరాన్ ప్రాంతాల్లోని ఇరాన్ సైన్యానికి సంబంధించిన కీలక క్షిపణి కేంద్రాలు, డ్రోన్ తయారీ స్థావరాలు, రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడినట్లు తెలుస్తోంది. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇరాన్ వైపు జరిగిన నష్టం గురించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
ఏప్రిల్ 8న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దానికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్ ఇప్పుడు నేరుగా ఇరాన్ భూభాగంపైనే వైమానిక దాడులకు దిగింది. అంతకు ముందు, పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలిగేలా ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది.
ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు దూసుకెళ్లాయి. లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడులకు ప్రతికారంగానే తాము ఈ చర్యకు దిగినట్లు టెహ్రాన్ స్పష్టం చేసింది. దానితో ఇరాన్‌పై భీకర ప్రతీకార దాడులు చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
ఏప్రిల్ ప్రారంభంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇరాన్ నుంచి ఇజ్రాయెల్‌పై జరిగిన తొలి ప్రత్యక్ష క్షిపణి దాడి ఇదే. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సోమవారం తెల్లవారుజామున ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది.
More Stories
హెజ్బొల్లా ప్రధాన కార్యాలయం ధ్వంసం!.. ఇద్దరు మృతి
అమెరికా కదలికలపై ఇజ్రాయిల్ నిఘా?
అమెరికాలో మేడ్చల్ యువకుడి కాల్చివేత