ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ -ఏయు ఫైనాన్స్ బ్యాంక్ మోసం కేసులో చండీగఢ్, పంచకుల, ఢిల్లీ ఎన్ సి ఆర్ పరిధిలోని ఆరు ప్రదేశాల్లో సీబీఐ సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. హర్యానాకు చెందిన సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులు, నొయిడాకు చెందిన విపమ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, దాని డైరెక్టర్ తో సంబంధం ఉన్న ప్రాంగణాల్లో రూ. 661 కోట్ల మోసంకు సంబంధించి సోదాలు నిర్వహించినట్లు ఒక అధికారిక ప్రకటన తెలిపింది.
విచారణలో ప్రభుత్వ ఉద్యోగులు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై, ఖాతాలు తెరవడానికి, నిధులు బదిలీ చేయడానికి, వాటిని దారి మళ్లించడానికి సహకరించినట్లు ఆధారాలు లభించాయని ఆ అధికారులు వెల్లడించారు. సోదాల్లో నేరారోపణ పత్రాలు, డిజిటల్ పరికరాలు, ఆస్తి పత్రాలు, ఇతర సంబంధిత సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఈ లావాదేవీలు సులభతరం చేసినందుకు, అవతవకలపై చర్యలు తీసుకోకుండా ఉన్నందుకు ప్రభుత్వ ఉద్యోగులు అక్రమంగా ప్రయోజనం పొందారని ఏజన్సీ ఆరోపించింది. విపమ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ నేరానికి సంబంధించిన నగదును తన బ్యాంక్ ఖాతాలో జమ చేసుకుందని, ఆ తర్వాత దానిని తన డైరెక్టర్ వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేసిందని కూడా సీబీఐ తెలిపింది. దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు తేలిన ఇతర నిందితులపై అదనపు చార్జిషీట్లు దాఖలు చేస్తామని తెలిపింది.
హర్యానా, చండీగఢ్ పరిపాలనా విభాగం నుండి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై సోదాలు నిర్వహిస్తున్నట్లు సీబీఐ తెలిపింది. ఈ మోసం హర్యానా ప్రభుత్వంలో ఎనిమిది విభాగాలను, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంలోని రెండు విభాగాలను (చండీగఢ్ మునిసిపల్ కార్పోరేషన్, చండీగఢ్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ సొసైటీ (సి ఆర్ ఇ ఎస్ టి))లను ప్రభావితం చేసిందని పేర్కొంది.

More Stories
70 బిలియన్ డాలర్ల విదేశీ నిధులకై ఆశాభావం
భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.7 శాతం.. ప్రధాని మోదీ హర్షం
మహారాష్ట్రలో రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ