మూడోసారి ఆసియా కప్ విజేతగా భార‌త్.. మహిళలకు కాంస్యం

మూడోసారి ఆసియా కప్ విజేతగా భార‌త్.. మహిళలకు కాంస్యం
ఆసియాకప్‌ అండర్‌-18 హాకీ టోర్నమెంట్‌లో భారత యువ ఆటగాళ్లు అంచనాలకు మించి రాణించారు. పురుషుల విభాగంలో భారత జట్టు స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. మహిళల జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో భారత అండర్-18 పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ 2026లో చరిత్ర సృష్టించింది. జపాన్‌లోని కాకమిగహారాలో శనివారం జరిగిన ఫైనల్లో భారతజట్టు 4-1గోల్స్‌ తేడాతో ఆతిథ్య జపాన్‌ను చిత్తు చేసింది. 
 
దీంతో రికార్డు స్థాయిలో మూడోసారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. లీగ్‌ ‌దశలో జపాన్‌ ‌చేతిలో ఓడిన భారత యువ జట్టు ఫైనల్లో జపాన్‌‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. స్టార్ ఫార్వర్డ్ ఆశిష్ పుర్తి హ్యాట్రిక్ గోల్స్‌తో జపాన్ డిఫెన్స్ ను ఛేదించగా టీం స్కోర్ కు కెప్టెన్ కేతన్ కుష్వాహా మరో గోల్ జోడించాడు. జపాన్ తరఫున గాకు నుమాడా ఒక్క గోల్ మాత్రమే సాధించగలిగాడు. 
 
ఇటీవలే పాకిస్థాన్‌పై సెమీఫైనల్లో నాలుగు గోల్స్‌తో మెరిసిన ఆశిష్ పుర్తి ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అతడి అద్భుత ప్రదర్శనతో టైటిల్ పోరులో జపాన్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వ కుండా భారత యువ జట్టు విజేతగా నిలిచింది.

ఇక భార‌త మహిళల జట్టు కాంస్య పతక పోరులో పటిష్ట కొరియాను చిత్తు చేసింది. మూడ‌వ స్థానం కోసం జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ 3-0 గోల్స్ తేడాతో కొరియాపై విజ‌యాన్ని న‌మోదు చేసింది. సందీప్ కుమారి, స్వీటీ కుజుర్, నౌషీన్ నాజ్‌లు భార‌త్ త‌ర‌పున గోల్స్ చేశారు. సెమీఫైన‌ల్స్ మ్యాచ్‌లో చైనా చేతిలో షూటౌట్ ఓడిన భార‌త జ‌ట్టు కాంస్య పతకం కోసం గ‌ట్టిగా పోరాడింది. ఆరంభంలోనే డ్రీమ్ స్టార్ట్ అందింది.

తొలి రెండు నిమిషాల్లోనే సందీప్ కుమారి గోల్స్ చేసింది. దీంతో ఇండియా ఈ మ్యాచ్‌లో దూకుడు ప్ర‌ద‌ర్శించింది. మ్యాచ్ మొత్తం ఇండియా జ‌ట్టు అటాక్ చేసింది. ఈ టోర్నీలో నౌషీన్ త‌న ఖాతాలో మొత్తం 12 గోల్స్ చేసింది. సందీప్ కుమారి ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకుంది.

అండర్-18 ఆసియా కప్ 2026లో అద్భుత ప్రదర్శనతో మెరిసిన భారత పురుష, మహిళల హాకీ జట్లకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని యువ ఆటగాళ్లు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. “టోర్నీ అంతటా అసాధారణ నైపుణ్యం, జట్టు సమన్వయాన్ని ప్రదర్శించి ఫైనల్లో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఈ విజయం యువతలో హాకీపై పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని మోదీ పేర్కొన్నారు.