భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను వరుసగా మూడోసారి యధావిధిగా ఉంచింది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఇంధన ధరలు పెరిగినా ఆర్బీఐ మాత్రం కీలక వడ్డీ రేట్లలో మార్పు చేయలేదు. ఇరాన్ యుద్ధం వల్ల క్రూడాయిల్ ధరలు అమాంతం పెరగడంతో భారత్ లాంటి దిగుమతి దేశాలపై తీవ్ర ప్రభావం పడింది. అయితే ద్రవ్య పరపతి విధాన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు.
షార్ట్ టర్మ్ వడ్డీ రేటు లేదా రెపో రేటును 5.25 శాతం వద్దే ఉంచాలని ఎంపీసీ నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఇంధన ధరలు, బలహీన రుతుపవనాలు.. ద్రవ్యోల్బన పరిస్థితులను సూచిస్తున్నా ఆర్బీఐ మాత్రం ఆశాజనకంగా నిర్ణయం తీసుకున్నది. కీలకమైన రెపో రేటును 5.25 శాతంగానే యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించినా ద్రవ్యోల్బణ నియంత్రణే లక్ష్యంగా ఆర్బీఐ తన మానిటరీ పాలసీ విధానాన్ని ‘న్యూట్రల్’గానే కొనసాగిస్తోందని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు.
మార్కెట్లలో ఒడిదుడుకులు పెరగడం వల్ల అంతటా ఆందోళనకర వాతావరణం నెలకొన్నదని, ఇలాంటి అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొని, అతి తక్కువ నష్టంతో నిలదొక్కుకునే పూర్తి నమ్మకం, సామర్థ్యం భారతదేశానికి ఉన్నాయని చెప్పారు. జూన్ నెలలో జరిగిన ఈ సమావేశంతో కలుపుకుని వరుసగా మూడోసారి ఆర్బీఐ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.
గత ఏడాది డిసెంబర్లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన కేంద్ర బ్యాంక్, ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ పాలసీలోనూ వడ్డీ రేట్లనుయథాతథంగానే ఉంచింది. తాజాగా జూన్ సమీక్షలోనూ అదే నిర్ణయాన్ని అమలు చేసింది. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) లోని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఓటు వేసి రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగించాలని నిర్ణయించినట్లు గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
ఇక రెపో రేటులో ఎలాంటి మార్పు లేకపోవడంతో, దానికి అనుబంధంగా ఉండే ఇతర రేట్లు కూడా స్థిరంగానే ఉన్నాయి. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల హోమ్ లోన్, కార్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకున్న పాత రుణగ్రహీతల ఈఎంఐలలో తక్షణమే ఎలాంటి మార్పులు ఉండవు. కొత్తగా రుణాలు తీసుకోవాలనుకునే వారికి కూడా ప్రస్తుత వడ్డీ రేట్లే వర్తిస్తాయి.
ఇంధన ధరలు పెరగడం, ఇతర ముడి సరుకుల ధరల భారం, సరఫరా గొలుసులలో అంతరాయాలు దేశీయ ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను గతంలో ప్రకటించిన 6.9 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించింది. త్రైమాసికాల వారీగా చూస్తే తొలి త్రైమాసికంలో 6.6 శాతం, రెండో త్రైమాసికంలో 6.3 శాతం, మూడో త్రైమాసికంలో 6.5 శాతం, నాలుగో త్రైమాసికంలో 6.8 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ అంచనా వేసింది.
ఇంధన ధరల పెరుగుదలతో పాటు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో ఆహార ధరలపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంటూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాను 4.6 శాతం నుంచి 5.1 శాతానికి పెంచింది. అయితే దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు తగిన స్థాయిలో ఉండటం సానుకూల అంశమని ఆర్బీఐ పేర్కొంది.
విదేశీ పెట్టుబడులను మరింత ఆకర్షించేందుకు ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్ల పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను సరళీకరించినట్లు చెప్పారు. అలాగే ఈక్విటీ మార్కెట్లో ఎన్ఆర్ఐలు, ఓవర్సీస్ సిటిజన్ల పెట్టుబడి పరిమితులను పెంచినట్లు తెలిపారు. దీంతో భారత మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

More Stories
కొత్త రాజకీయ ఉద్యమానికి అన్నామలై శ్రీకారం
రెండు రోజులకే శివకుమార్ మంత్రివర్గంలో అసమ్మతి
రాజేష్ ఎక్సపోర్ట్స్ రూ.15 లక్షల కోట్ల మాయాజాలం