* కాంగ్రెస్ ప్రభుత్వానికి ముస్లింల అల్టిమేటం
కర్ణాటకలోని ముస్లిం మత పెద్దలు, ఉలేమాలు రాష్ట్ర మంత్రివర్గంలో తమ వర్గానికి మరింత ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదుగురు ముస్లిం నాయకులను మంత్రులుగా నియమించాలని వారు కోరారు. ముస్లిం ఓటర్ల మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కాబట్టి ప్రభుత్వంలో తమ వర్గానికి తగిన ప్రాతినిధ్యం దక్కాలని వారు వాదించారు.
ఐదు మంత్రి పదవులు దక్కకపోతే తమ సత్తా ఏంటో ప్రభుత్వానికి తెలిసేలా చేస్తామని హెచ్చరించారు. హుబ్బళ్లిలోని బెల్లి నగర్‌లో ఉన్న హజ్రత్ సయ్యద్ ఫతే షా వలీ దర్గా వద్ద జరిగిన ముస్లిం నాయకులు, మత గురువుల సమావేశంలోనే ఈ డిమాండ్ వెలువడింది. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహించారు.
సమావేశంలో, కాంగ్రెస్ సీనియర్ నాయకులైన బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్, ఎన్ఏ హారిస్, తన్వీర్ సైట్, సలీం అహ్మద్‌లను మంత్రివర్గంలోకి తీసుకోవాలని డిమాండ్లు లేవనెత్తారు. “గత 35 నుండి 40 ఏళ్లుగా, ఈ నాయకులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. వీరు తమ సమాజం కోసం, అలాగే పార్టీ కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. కాబట్టి, ఈ ఐదుగురు సీనియర్ నాయకులకు తగిన గౌరవం కల్పించి, సముచిత బాధ్యతలను అప్పగించాలని మేము ఆశిస్తున్నాము”అని తెలిపారు.
ముస్లిం వర్గానికి చెందిన యూటీ ఖాదర్ ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీలో స్పీకర్‌గా కొనసాగుతుతున్నందున మరో నాలుగు మంత్రి పదవులు ముస్లింలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. మరో ముస్లిం మత పెద్ద మాట్లాడుతూ తమకు ప్రభుత్వంలో, క్యాబినెట్‌లో ప్రాధాన్యం కల్పించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
కర్ణాటకలో ముస్లింలు ఐక్యంగా ఉండి కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచామని, పార్టీని అధికారంలోకి తెచ్చామని పేర్కొంటూ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తమ పాత్ర ఎంతో కీలకమని గుర్తు చేశారు. అందువల్లే తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంపై భవిష్యత్‌లో ఇంకా ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. తాము కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని మత పెద్దలు వివరించారు.

More Stories
నాయకత్వ సంక్షోభంలో ఇండియా కూటమి.. దూరంగా డీఎంకే
తరుణ్ సింగ్ తో సహా 11 మంది బిజెపి రాజ్యసభ అభ్యర్థులు
రాజ్యాంగ నిపుణుడు సుభాష్ సి కశ్యప్ కన్నుమూత