అంతర్జాతీయ యోగా దినోత్సవంగా సందర్భంగా ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది పాల్గొనేలా యోగా కార్యక్రమాలతో యోగాంధ్ర 2026 నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నెల 7 నుంచి 20 వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహణకు రూ.10 కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయించామని తెలిపారు.
యోగాంధ్ర నిర్వహణపై సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్య సమస్యలకు యోగా మంచి మెడిసిన్ అని తెలిపారు. వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవించేందుకు యోగాను అనుసరించాలని చెప్పడమే ఈ ఏడాది థీమ్ ఉద్దేశమని చెప్పారు. అమరావతిలో జరిగే ప్రధాన కార్యక్రమంలో కృష్టానది వెస్ట్ బైపాస్ వంతెనపై 25 వేల మందితో యోగా ప్రదర్శన నిర్వహిస్తామని, ప్రతి జిల్లాకు ప్రత్యేక థీమ్ నిర్ణయించామని తెలిపారు.
“ప్రతీ ఒక్కరూ నిత్య సాధనంగా యోగాను అవలంబించాలి. ఈ నెల 7 నుంచి 21వరకూ కోటి మందిని భాగస్వాముల్ని చేసేలా 14 రోజులపాటు కార్యక్రమాలు నిర్వహిస్తాం. పాఠశాల నుంచీ స్వర్ణ వార్డు వరకూ ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ఈసారి అమరావతి వేదికగా కృష్ణానది ఒడ్డున పశ్చిమ బైపాస్ పై 25వేల మందితో ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తాం” అని ముఖ్యమంత్రి తెలిపారు.
రాష్ట్రంలోని 56 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించి యోగా-టూరిజాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 10 లక్షల మంది సర్టిఫైడ్ యోగా సాధకులను తయారు చేస్తామని, ప్రస్తుతం ఉన్న ట్రైనర్ల సంఖ్యను 2.50 లక్షలకు పెంచేందుకు కార్యాచరణ చేపట్టామని తెలిపారు. స్కూళ్లు, కాలేజీల్లో యోగాను చదువులో భాగం చేసేలా చర్యలు తీసుకుంటున్నామమని వివరించారు.
yogandhra.ap.gov.in ద్వారా కార్యక్రమాల వివరాలు, వీడియోలు, నమోదు ప్రక్రియ తదితర సమాచారం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం 21 వ్యాధులకు యోగాసనాల వీడియోలను ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు రూపొందించారన్న ఆయన, సోషల్ మీడియాలో ఈ వీడియోలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. సందేహాలకు సంబంధించి 8142404888 కాల్ సెంటర్ ద్వారా సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
సంజీవిని పథకంలో యోగాను అనుసంధానం చేస్తామని చెప్పారు. నూనె, ఉప్పు, చక్కెర వంటివి వీలైనంత తక్కువ మోతాదు వాడితే ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు. డయాబెటిస్ అన్ని రోగాలకు గేట్ వేగా మారుతున్నందున దీనిపై ప్రజల్ని చైతన్యపరుస్తామని పేర్కొన్నారు. ఆరోగ్యం-డబ్బులు ఆదాకు యోగా మంచి సాధనం అని స్పష్టం చేశారు.

More Stories
నేటి నుంచే ఉనికిలోకి దక్షిణ కోస్తా రైల్వే జోన్
‘పీఎం-సేతు’ ద్వారా ఏపీకి మొదటి వ్యూహాత్మక పెట్టుబడి
హథీరాంజీ మఠాధిపతి సంత్ అర్జున్దాస్కు `సుప్రీం’లో భారీ ఊరట