సీబీఎస్ఈలో భారీ ప్రక్షాళన.. చైర్మన్, కార్యదర్శుల మార్పు!

సీబీఎస్ఈలో భారీ ప్రక్షాళన.. చైర్మన్, కార్యదర్శుల మార్పు!

* సీబీఎస్‌ఈ రీ-వేల్యూషన్ పోర్టల్‌పై భారీ సైబర్ దాడి 

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) విద్యార్థుల పునఃమూల్యాంకన గందరగోళానికి గురైన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం భారీ ప్రక్షాళన చర్యలు చేపట్టింది. ఒకేసారి చైర్మన్, కార్యదర్శులను మార్చింది.  సీనియర్ ఐఏఎస్ అధికారి లోఖండే ప్రశాంత్ సీతారామ్ నూతన సీబీఎస్ఈ అధిపతిగా, అలాగే, సీనియర్ అధికారి వరుణ్ భరద్వాజ్ కొత్త కార్యదర్శిగా నియమితుస్తున్నట్లు ప్రకటించింది.

అంతకుముందు, ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్‌ (ఓఎస్ఏం) విధానంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో సీబీఎస్‌ఈ ఛైర్మన్ రాహుల్ సింగ్, బోర్డు సెక్రటరీ హిమాంశు గుప్తాలను తక్షణమే ఆయా పదవుల నుంచి బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓఎస్ఎం వ్యవస్థ అమలు, విద్యార్థులు నివేదించిన సమస్యలపై కమిటీ సభ్యులకు వివరించడానికి పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్‌తోపాటు సీబీఎస్ఈ చీఫ్‌ రాహుల్ సింగ్‌కు పార్లమెంటు స్థాయీ సంఘం సమన్లు జారీ చేసిన కొద్దిసేపటికే ఈ బదిలీలు చేసింది. 

మరోవైపు, ఈ ఘటనపై విచారణకు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఛైర్‌పర్సన్ ఎస్.రాధాచౌహాన్‌ను ఈ కమిటీకి అధ్యక్షురాలిగా నియమించింది. ఈ మేరకు కేబినెట్ సెక్రటేరియట్ ఓ మెమోరాండం జారీచేసింది. అవసరమైతే ఇతర శాఖల అధికారుల సహాయం తీసుకునే అధికారం రాధా చౌహాన్‌కు కల్పించారు. ఒకనెల రోజుల్లోపు సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖకు ఆమె తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. 

సీబీఎస్ఈ బోర్డు పరీక్షల ప్రక్రియలో ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానం అమలు తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాంకేతిక లోపాలు, ఫీజు చెల్లింపుల్లో వైఫల్యాలు, వెరిఫికేషన్, రీ-వాల్యుయేషన్ ప్రక్రియల్లో జాప్యంపై బోర్డు విమర్శలు ఎదుర్కొంటోంది.

మరోవంక, తమ పోర్టల్‌పై భారీ సైబర్‌ దాడికి ప్రయత్నాలు జరిగాయని సీబీఎస్‌ఈ ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 16 వేల మంది రీవాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొంది. ఈ సమయంలోనే కొందరు డినయల్-ఆఫ్-సర్వీస్ అనే విధానంతో పోర్టల్‌పై దాడికి ప్రయత్నించారని, దీని వల్ల 2 నిమిషాల్లోనే దాదాపు 15 లక్షల మంది లాగిన్‌ అవ్వడానికి ప్రయత్నించారని తెలిపింది. 

అనధికారికంగా పోర్టల్‌లోకి చొరబడేందుకు లక్షకుపైగా సైబర్‌దాడుల ప్రయత్నాలు జరిగినట్లు తమ భద్రత వ్యవస్థ గుర్తించిందని వివరించింది. అయితే, ఈ సైబర్‌ దాడులను సమర్ధంగా అడ్డుకున్నామని, ప్రస్తుతం పోర్టల్ పనిచేస్తూనే ఉందని చెప్పింది. విద్యార్థుల రీవేల్యూషన్ దరఖాస్తులను ప్రాసెస్ జరుగుతోందని తెలిపింది. ఒకేసారి 8,000 మందికిపైగా స్టూడెంట్లు పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చిన వెల్లడించింది.

టెక్నికల్ టీమ్‌లు ఈ ప్లాట్‌ఫామ్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే స్పందిస్తున్నాయని పేర్కొంది. విద్యార్థులకు ఎటువంటి అంతరాయం లేకుండా సేవలను అందించేందుకు తమ బృందాలు కృషి చేస్తున్నాయని సీబీఎస్‌ఈ పేర్కొంది.

గత నెల, మే 13వ తేదీన సీబీఎస్‌ఈ బోర్డు 12వ తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఆ ఫలితాల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గింది. అయితే, జవాబు పత్రాల మూల్యాంకణం కోసం కొత్తగా తీసుకొచ్చిన ఓఎస్‌ఎం వల్లే తక్కువ మార్కులు వచ్చాయని కొంతమంది విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు జవాబు పత్రాల స్కానింగ్‌ కాపీలను అందిస్తామని, సరిచూసుకొని పునర్‌మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవచ్చని సీబీఎస్ఈ బోర్డు పేర్కొంది. 

 
ఈ క్రమంలో, తమ పత్రాలు తారుమారయ్యాయని కొంతమంది విద్యార్థులు ఫిర్యాదు చేశారు. పునర్‌మూల్యాంకన ప్రక్రియలో భాగంగా సీబీఎస్‌ఈ అప్‌లోడ్‌ చేసిన భౌతికశాస్త్ర సమాధానపత్రం తనది కాదని దిల్లీకి చెందిన వేదాంత్‌ అనే విద్యార్థి ఆరోపించారు. సంజన అనే మరోవిద్యార్థిని కూడా తన రసాయనశాస్త్ర సమాధాన పత్రం తారుమారైందని ఫిర్యాదు చేశారు. దీంతో త్వరలోనే తమ సమస్యలను పరిష్కరిస్తామని బోర్డు స్పష్టం చేసింది.