నేపాల్‌తో ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంలో తృతీయ పక్షాల ప్రమేయం పట్ల భారత్ విముఖత వ్యక్తం చేసింది. సరిహద్దు సమస్యకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించుకోవడానికి ఇరు పక్షాలు ద్వైపాక్షిక యంత్రాంగాలను ఏర్పాటు చేసుకున్నాయని తెలిపింది. నేపాల్, భారత్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాల పరిష్కారానికి చైనా, యూకేల ప్రమేయం ఉండాలని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
భారత్- నేపాల్ సరిహద్దులో దాదాపు 98 శాతం గుర్తించామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. “సరిహద్దు విషయాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించుకోవడానికి భారత్, నేపాల్ కృషి చేస్తున్నాయి. అందుకోసం ఇరుదేశాలు ద్వైపాక్షిక యంత్రాంగాలను ఏర్పాటు చేసుకున్నాయి” అని గుర్తు చేశారు.
“అయితే, భారత్- నేపాల్‌ల మధ్య సరిహద్దు సమస్య పరిష్కారంలో విషయంలో ఏ మూడో పక్షానికీ తావులేదు. ఇరుదేశాల సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధాని బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలను, అలాగే ఈ విషయంపై నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనను పరిశీలించాం. భారత్-నేపాల్ సరిహద్దులో దాదాపు 98 శాతం గుర్తించాం. కొన్ని అపరిష్కృత విభాగాలు ఉన్నాయి. గండక్ నది ప్రవాహ మార్గం మారడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది” అని తెలిపారు.
అంతేకాకుండా ప్రస్తుతం సంయుక్తంగా మ్యాపింగ్ చేస్తున్న సరిహద్దులోని గుర్తించిన విభాగాల్లో ఆక్రమణలు, నో మ్యాన్స్ ల్యాండ్‌లోకి చొరబాటు కేసులు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. కాగా, ఈయూ-పాకిస్థాన్ వ్యూహాత్మక చర్చల 8వ రౌండ్ అనంతరం జారీ చేసిన సంయుక్త పత్రికా ప్రకటనలో జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన ప్రస్తావనలను తీసుకురావడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఈ విషయంలో ఎలాంటి హక్కు లేనివారు భారతదేశ అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించకుండా ఉండాలని తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్ధాఖ్ భారత్‌లో అంతర్భాగమని, అవి దేశం నుంచి విడదీయరానివని జైస్వాల్ స్పష్టం చేశారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడులపైనా స్పందిస్తూ భారత్ పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను నిశితంగా గమనిస్తుస్తోందని పేర్కొన్నారు.
శాంతి, స్థిరత్వం కోసం చర్చలు, దౌత్యమే మార్గమని తాము చెబుతూనే ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు, అమెరికాలో అక్రమంగా నివసిస్తూ వాణిజ్య ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తున్న 30 మంది భారతీయులను అక్కడి అధికారులు అరెస్టులు చేయడంపైనా వివరణ ఇస్తూ భారత్ అక్రమ వలసలను ఏ విధంగానూ సమర్థించదని గుర్తు చేశారు. బహిష్కరణ కేసులు తమ దృష్టికి వచ్చినప్పుడల్లా అమెరికాకు సహకరిస్తామని చెప్పారు.
అలాగే భారత్, బంగ్లాదేశ్‌లు 54 నదులను పంచుకున్నాయని చెప్పారు. ఈ నదులన్నింటికీ సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఇరు దేశాల వద్ద ఒక ఉమ్మడి నదుల కమిషన్, ఒక వ్యవస్థీకృత ద్వైపాక్షిక యంత్రాంగం ఉందని వెల్లడించారు. వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ జూన్ 1న జరగాల్సిన అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు భారత పర్యటనకు రావాల్సి ఉండగా, అది వాయిదా పడిందని వెల్లడించారు.
ఇప్పుడు డెల్సీ రోడ్రిగ్జ్ జూన్ 3- 7 వరకు భారత్‌లో అధికారిక పర్యటన చేస్తారని తెలిపారు. తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్జ్ గతంలో వెనిజువెలా విదేశాంగ మంత్రిగా, ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా పలుమార్లు భారత్‌లో పర్యటించారని చెప్పారు. ఇది ఆమె ఆరో భారత పర్యటనని పేర్కొన్నారు. ఈ పర్యటన సందర్భంగా తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్జ్ ప్రధాని మోదీతో చర్చలు జరుపుతారని తెలిపారు.
“భారత్- వెనిజువెలా సంబంధాలపై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఔషధాలు, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో మరింత సహకారానికి మార్గాలను అన్వేషిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోదీ, రోడ్రిగ్జ్ భారతదేశంలోని పలు ప్రాంతాలను సందర్శిస్తారు” అని వివరించారు.
“ఇంధనం, పెట్టుబడుల విషయంలో భారత్ వెనిజువెలాకు ఒక ముఖ్యమైన భాగస్వామి. భారత ప్రభుత్వ రంగ సంస్థలు వెనిజువెలా ఇంధన రంగంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టాయి. అవి తమ ఉనికిని మరింత పటిష్ఠం చేసుకోవడానికి అవకాశాల కోసం అన్వేషిస్తున్నాయి” అని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.

More Stories
మమతాకు ముఖం చాటేసిన టిఎంసి ఎంపీలు, ఎమ్యెల్యేలు
అమరవీరుల కలలు కన్న తెలంగాణ నిర్మాణంలో వెనుకబడ్డాం
సీబీఎస్ఈలో భారీ ప్రక్షాళన.. చైర్మన్, కార్యదర్శుల మార్పు!