జమ్ముకశ్మీర్ లో మొదటిసారి ఉగ్రవాద మరణాలు లేని మే నెల!

జమ్ముకశ్మీర్ లో మొదటిసారి ఉగ్రవాద మరణాలు లేని మే నెల!
జమ్మూకశ్మీర్‌లో గత మూడు దశాబ్దాలుగా రావణకాష్టంలా మండుతున్న ఉగ్రవాద హింసకు క్రమంగా అడ్డుకట్ట పడుతుంది. ఎప్పుడూ నెత్తుటి మరకలతో, ఉగ్ర దాడుల వార్తలతో సంచలనంగా మారే కశ్మీర్ లోయలో సరికొత్త చరిత్ర లిఖించబడింది. ఉగ్రవాదం కోరలు చాచిన నాటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే, చరిత్రలోనే మొదటిసారిగా ఈ ఏడాది మే (2026) నెలలో ఒక్క ఉగ్రవాద సంబంధిత మరణం కూడా నమోదు కాలేదు. 
 
పూర్తి ప్రశాంత వాతావరణం మధ్య ఈ మాసం ముగియడం రక్షణ రంగంలో ఒక అద్భుత విజయంగా భద్రతా దళాలు భావిస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం 2026 సంవత్సరపు మొదటి ఐదు నెలల కాలంలో జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా కేవలం 12 ఉగ్రవాద సంబంధిత మరణాలు మాత్రమే నమోదయ్యాయి.  ఈ 12 మందిలో 9 మంది ఉగ్రవాదులు కాగా, భద్రతా దళ సిబ్బందికి చెందిన ఒకరు, గుర్తింపు వివాదం ఉన్న ఒక స్థానికుడు, మరొక గుర్తుతెలియని వ్యక్తి ఉన్నారు. ఈ ఐదు నెలల కాలంలో ఉగ్రదాడుల కారణంగా సాధారణ పౌరులు ఎవ్వరూ ప్రాణాలు కోల్పోకపోవడం గమనార్హం.

జమ్మూకశ్మీర్ పోలీస్ డేటా ప్రకారం, ఒకప్పుడు కశ్మీర్‌లో మే నెల వచ్చిందంటేనే అత్యంత హింసాత్మక వాతావరణం ఉండేది. ఈ ఒక్క నెలలోనే ఏకంగా 288 ఉగ్రవాద సంబంధిత మరణాలు నమోదయ్యాయి. మరణాల సంఖ్య మరింత పెరిగి 300కు చేరింది. ఆ సమయంలో దాదాపు ప్రతిరోజూ కశ్మీర్ లోయతో పాటు జమ్మూ ప్రాంతాల్లో పౌరులు, ఉగ్రవాదులు, సైనికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయేవారు. 

కానీ, 2026 మే నాటికి ఈ మరణాల సంఖ్య ‘సున్నా’ కు పడిపోవడం విశేషం. కశ్మీర్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్ పూర్తిగా బలహీనపడిందని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. “లోయలో ఉగ్రవాద సంస్థలకు ఆర్థికంగా, సామాజికంగా మద్దతు ఇచ్చే వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నిరంతర ఉగ్రవాద నిరోధక చర్యలు, నిఘా వర్గాల మధ్య మంచి సమన్వయం, స్థానిక యువత ఉగ్రవాద గ్రూపుల్లో చేరడం బాగా తగ్గిపోవడమే ఇందుకు కారణం” అని భద్రతాధికారులు చెబుతున్నారు.

ఉగ్రవాదుల చొరబాటును నిరోధించడానికి కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, చొరబాటు నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం వంటివి క్షేత్రస్థాయి పరిస్థితిపై సానుకూల ప్రభావాన్ని చూపాయని భద్రతా అధికారులు తెలిపారు. “ఉగ్రవాదుల స్థానిక నియామకాలు ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయాయి, చొరబాట్లు కూడా అత్యంత తక్కువగా ఉన్నాయి,” అని ఒక అధికారి పేర్కొన్నారు. 

“ఉగ్రవాద సంస్థల అగ్ర కమాండర్లందరూ హతమయ్యారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్ల నెట్‌వర్క్‌తో సహా ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, సహాయక వ్యవస్థను ధ్వంసం చేశాం, కొత్త నియామకాలను నిలిపివేశాం,” అని ఆయన చెప్పారు. “ఉగ్రవాదుల నియామకాలను గణనీయంగా తగ్గించడానికి భద్రతా దళాలు, పోలీసులు తీవ్రంగా కృషి చేశారు,” అని జమ్మూ కాశ్మీర్ మాజీ పోలీస్ చీఫ్ ఎస్.పి. వైద్ తెలిపారు. 

రెండు దశాబ్దాల క్రితం నాటి పరిస్థితులతో పోలిస్తే, నేడు జమ్మూ కాశ్మీర్ లో భద్రతా వాతావరణం పూర్తిగా మారిపోయిందని చెప్పారు.  జమ్మూకశ్మీర్ వార్షిక మరణాల గణాంకాలు పరిశీలిస్తే, ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. 

2000లో 2799 ఉగ్రవాద సంబంధిత మరణాలు నమోదయ్యాయి. 2021లో అత్యధికంగా 4,011 మరణాలు సంభవించాయి. అందులో 1000 మందికి పైగా పౌరులు, 628 భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, 2,345 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వాస్తవానికి ఉగ్రవాదం మొదలైన ప్రారంభ సంవత్సరాల్లో వార్షిక మరణాల సంఖ్య 3000కు పైగానే ఉండేది. 

కానీ ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది.   ఇక ఈ 2026 మొదటి 5 నెలల్లో ఉగ్రవాద చరిత్రలోనే అత్యంత తక్కువ మరణాలు నమోదు అయ్యాయి. విభాగాల వారీగా చూస్తే, 2021లో 1,024 మంది పౌరులు మరణించగా, ఈ 2026లో ఒక్క పౌరుడు కూడా ఉగ్ర ఘటనల్లో మరణించలేదు. 2021లో భద్రత సిబ్బంది 628 మంది మరణించగా, ఈ ఏడాది కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. 

ఇక 2001లో 2,345 మంది ముష్కరులు మరణించగా, ఈ సంవత్సరం ఆ సంఖ్య 9కి తగ్గింది. అధికారిక గణాంకాలు ఉగ్రవాద సంబంధిత మరణాలు తగ్గినట్లు చూపిస్తున్నప్పటికీ, ఉగ్ర ముప్పు పూర్తిగా తొలగిపోలేదని, ఉగ్రవాదాన్ని పునరుద్ధరించడానికి ముష్కరుల ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని భద్రతాధికారులు చెబుతున్నారు.